హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ):‘హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) అలైన్మెంట్ మార్పుతో అతిపెద్ద స్కామ్ జరగబోతున్నది. పెద్దల భూములు, లే అవుట్లు కాపాడి.. పేదల భూములను కొల్లగొట్టేందుకు అలైన్‌మెంట్‌నే మార్చేశారు. ట్రిపుల్ ఆర్ కుంభకోణం వివరాలను గురువారం మీడియా ముందు బయటపెడతా’ అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సంచలన విషయాలను వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రూపొందించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన సొంత ప్రయోజనాల కోసం మార్చుకుంటున్నదని విమర్శించారు. ఫోర్త్ సిటీ సమీపంలోని తమ నాయకుల భూముల కోసం అలైన్మెంట్ మార్చి, రీజినల్ రింగ్ రోడ్డు స్వరూపాన్నే మార్చేశారని, దీనివల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇప్పు డు ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందో రైతులకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలైన్మెంట్ మార్పు వల్ల ట్రిపుల్ఆర్ భూసేకరణలో ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ జిల్లా రైతులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. చట్టప్రకారమే భూ సేకరణ జరగాలని, ఇష్టానుసారంగా పేదల భూములను లాక్కుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిఫుల్‌ఆర్) అలైన్మెంట్ మార్పుతో భూములు కోల్పోతున్న వికారాబాద్ జిల్లా రైతులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వచ్చి కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్.. తమ పార్టీ ప్రతినిధులు బాధిత రైతులతో వస్తారని, వారికి పూర్తి వివరాలు వెల్లడించి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బాధిత రైతులతో, అనంతరం మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్ కీలక విషయాలను వెల్లడించారు.
పేదల భూములే ఎందుకు పోతున్నాయ్?
ప్రభుత్వం సేకరించే భూమిని ఎందుకు తీసుకుంటున్నదో చాలా స్పష్టంగా చెప్పాలని, ఎంత తీసుకుంటున్నదో కూడా స్పష్టంచేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల మీదుగా అలైన్మెంట్ రూపొందించామని గుర్తుచేశారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలైన రంజిత్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భూములు అలైన్మెంట్లో పోవడం లేదు. కానీ పేదల భూములు మాత్రమే ఎందుకు పోతున్నాయని ప్రశ్నించారు. గ్రామస్థులందరూ ఒక్కమాటపై నిలబడాలని, విడివిడిగా సంతకం చేయొద్దని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేను తీసుకొని సీఎం వద్దకు వెళ్లి సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కచ్చితంగా భూసేకరణ చట్టం ప్రకారమే భూ సేకరణ లక్ష్యాలు ఉండాలని సూచించారు. అవసరమైతే భూములను కోల్పోతున్న ప్రతి రైతుకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సొంత ఎజెండాతోనే భూసేకరణ
గతంలో ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణలో ఆనాటి కాంగ్రెస్ సర్కార్ సొంత అజెండాతోనే ముందుకెళ్లిందని, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడు ్డభూసేకరణలోనూ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సొంత అజెండాతోనే వ్యవహరిస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒరిజినల్ అలైన్మెంట్ కాకుండా సొంత డబ్బుతో రహదారి కడుతున్నామని చెప్పి తమ వారి భూములను కాపాడుకునేందుకు అడ్డగోలుగా అలైన్‌మెంట్‌నే మార్చే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. అందుకోసం వేలాదిమంది రైతుల జీవితాలను చీకటిమయం చేస్తున్నదని తెలిపారు. వికారాబాద్‌లో అలైన్మెంట్ మార్పు వల్ల భూములు కోల్పోతున్న ప్రతి ఒకరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని, అవసరమైతే వారి తరఫున న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
పేదల భూములకు నష్టం కలిగించొద్దు
వికారాబాద్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులందరినీ కలుపుకొని ముందుకెళ్తామని కేటీఆర్ వెల్లడించారు. ట్రిఫుల్ ఆర్‌ను సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భూముల మీదుగా తీసుకెళ్లాలని, పేదల భూములకు నష్టం జరగకుండా చూడాలని సూచించారు. అవసరమైతే స్థానిక శాసనసభ్యులతో కలిసి స్పీకర్‌తో కూడా మాట్లాడతానని చెప్పారు. ఈ విషయంలో పార్టీలకతీతంగా చొరవ తీసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ బాగుండాలి, ప్రజలు బాగుండాలనేదే తమ ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ బాధితుల అంశంలో ఏకం కావాలని, పేదలకు నష్టం జరగకుండా చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, నాయకులు శుభప్రద్‌పటేల్, కార్తీక్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్, జైపాల్‌రెడ్డి కుటుంబసభ్యుల కోసమే
ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం.. ట్రిఫుల్ ఆర్ కోసం మాత్రం తమ భూములకు లాభం చేకూర్చడానికి భూములు తీసుకుంటామని చెప్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ట్రిఫుల్ ఆర్, ఫోర్త్ సిటీకి మధ్యలో వేస్తున్న రోడ్డు కేవలం సీఎం రేవంత్‌రెడ్డి, దివంగత కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి కుటుంబసభ్యుల భూముల కోసమేనని, ఈ రోడ్డు వెంబడి అనేక మందితో భూములు కొనుగోలు చేయించి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ఎలాంటి భూసేకరణ అవసరం లేకుండా రూపొందించిన ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ వేని రేవంత్‌రెడ్డి రద్దుచేశారని విమర్శించారు. గతంలోనే ఎక్స్‌ప్రెస్ వే కోసం భూమిని ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్‌లో ఉంచామని, మెట్రో రైల్ కోసం ఉంచిన భూమిని ప్రస్తుతం వాడుకోవచ్చని చెప్తున్నా, ఈ ప్రభుత్వం మూర్ఖంగా రద్దు చేసిందని మండిపడ్డారు. ఒక మంత్రి ‘మా ప్రభుత్వం వచ్చేది లేదు, చచ్చేది లేదు’ అంటుంటే, ఇంకొక మంత్రి ‘రీజినల్ రింగ్ రోడ్డు వచ్చేది లేదు’ అని అంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ భూముల నుంచే రోడ్లేయాలె
దేవరంపల్లిలో నాకు ఎక రం 28 గుంటల భూమి ఉన్న ది. కొంత ఈత చెట్లు పెట్టిన. కొంత కూరగాయలు పెట్టిన. ఇప్పుడు ఈ భూమి రోడ్డు విస్తరణలో పోతుందని చెప్తున్నరు. మేమెట్ల బతకాలె?. పిల్లలకు ఏం పంచి ఇవ్వాలె? పేదల భూముల నుంచి రాకుండా గుట్టలు, ప్రభుత్వ భూముల నుంచి రోడ్లు వేయాలి.
-జీ వీరాగౌడ్, దేవరంపల్లి,మోమిన్‌పేట మండలం, వికారాబాద్ జిల్లా
మాకున్న భూమినంతా తీసుకుంటరట!
రీజినల్ రింగు రోడ్డు కోసం మాకున్న భూమినంతా తీసుకుంటరట. మావోడి ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. మాకున్నదే ఒక ఎకరం మూడు గుంటలు. అదే మా కుటుంబానికి ఆధారం. మా ఆయన జరిగిపోయిండు. కొడుకు పోయిండు. మనమడితో బతుకుతున్న ఉన్న భూమినంతా సర్కారే గుంజుకుంటే నేను, వాడు ఎట్ల బతుకుతం. మీరే న్యాయం చేయాలి.
-రుక్కమ్మ, దేవరంపల్లి, మోమిన్‌పేట మండలం, వికారాబాద్ జిల్లా
ఇద్దరు కొడుకులకు ఏం పంచి ఇయ్యాలె
నా పేరు మీద ఎకరం ఐదు గుంటలు, మా ఆయన పేరు మీద ఎకరం ఎనిమిది గుంటల భూమి ఉన్నది. రెండు చోట్ల ఉన్న భూమిని ఇప్పుడు రోడ్డు కోసం సర్కారోళ్లు తీసుకుంటరట. ఇదెక్కడి న్యాయం. మాకున్న ఇద్దరు కొడుకులకు ఏంపంచి ఇయ్యాలె. భూమే మాకు ఆధారం. అదిపోతే మా జీవనాధారమే పోతది. -లక్ష్మి, దేవరంపల్లి,మోమిన్‌పేట మండలం, వికారాబాద్ జిల్లా
అలైన్మెంట్ మార్చిన్రంట
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏసిన అలైన్మెంట్ ప్రకారం.. మా భూములు పోకపోతుండె. కాంగ్రెస్ వచ్చినంక కొందరు పెద్దల కోసం రోడ్డు అలైన్మెంట్ మార్చినట్టు చెప్తున్నరు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి ఇక్కడ భూములు కొన్నరట.. వారి భూముల్ని కాపాడేందుకు మాలాంటి పేదల భూముల వైపు రోడ్లు మార్చుతున్నరట. ఇప్పుడు నాకున్న ఎకరం భూమి పోయే ప్రమాదమొచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలె? నా కొడుకులకు ఏం చెప్పాలె?
-చాకలి రాములు, దేవరంపల్లి,మోమిన్‌పేట మండలం, వికారాబాద్ జిల్లా
మాకు బతుకుదెరువెట్ల?
రోడ్డు వెంటే మాకు ఎకరంన్నర భూమి ఉన్నది. తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న భూమిని ఇప్పుడు రోడ్డుకు తీసుకుంటే మేము ఎట్ల బతకాలె. అంతా రెండు పంటలు పండే భూములు. వ్యవసాయం చేసుకొని బతికేటోళ్లం. ఇప్పుడు మా భూములు గుంజుకుంటే మాకు బతుకుదెరువెట్ల? మీరే న్యాయం చేయాలి.
– సత్తెమ్మ, దేవరంపల్లి, మోమిన్‌పేట మండలం, వికారాబాద్ జిల్లా
ఆర్ఆర్ఆర్ నిర్వాసితులకు కేటీఆర్ అభయం
రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుతో భూములు కోల్పోతున్న వికారాబాద్ జిల్లా రైతులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వచ్చి కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధిత రైతులకు అండగా ఉంటామని, అధైర్య పడొద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ట్రిపుల్‌ఆర్‌పై రైతుల రణం
కాంగ్రెస్ సర్కారు రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని బాధిత గ్రామాల రైతులంతా బుధవారం హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిలోని అన్నెబోయినపల్లి వద్ద పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. నిర్వాసితులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్