హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని, ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమమైనా, కేసీఆర్ నాయకత్వంలో మలిదశ పోరాటమైనా, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైనా.. వీటన్నింటికీ బీజం పడింది తెలంగాణ సాయుధ పోరాటంతోనేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దామని పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన అమరవీరులకు బీఆర్ఎస్ తరఫున, కేసీఆర్, ప్రతి గులాబీ సైనికుడి తరపున శిరసు వంచి వినమ్రంగా నివాళులర్పిస్తున్నాం’ అని పేరొన్నారు. తెలంగాణలో తిరిగి సంక్షేమ రాజ్యం రావాలనిపోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూనాచారి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, నాయకులు ఆర్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, శంకర్‌నాయక్, తుల ఉమ, దూదిమెట్ల బాలరాజుయాదవ్, చిరుమళ్ల రాకేశ్, వెంకటేశ్వర్‌రెడ్డి, గజ్జెల నగేశ్, సుమిత్రా ఆనంద్, కురవ విజయ్ తదితరులు పాల్గొన్నారు.