నల్లగొండ: నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రెండు ప్రైవేటు బస్సుల మధ్య కారు ఇరుక్కుపోవడంతో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన గుర్రె జోష్ కుమార్, పైల మురళితో పాటు హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన చల్లా శ్రీహర్ష ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ముగ్గురు కలిసి ఆదివారం తెల్లవారుజామున కారులో నందిగామ నుంచి హైదరాబాద్‌కి బయలుదేరారు.
ఈ క్రమంలో చిట్యాలకు చేరుకున్న సమయంలో కల్వర్టు వద్ద ముందు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా ఆగింది. దీంతో వెనుక ఉన్న కారు కూడా ఆగింది. అయితే అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో ప్రైవేటు బస్సు కారును వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో రెండు బస్సుల మధ్య కారు ఇరుక్కుని నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న శ్రీహర్ష తలకు బలమైన గాయాలు కాగా.. జోష్ కుమార్‌కి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి నార్కట్‌పల్లిలోని కామినేని దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీహర్షను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.