Harish Rao | హైదరాబాద్ : కామారెడ్డి, ఎల్లారెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. బాధిత రైతులను కలిసి, పంట నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు హరీష్ రావు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులకు నష్ట పరిహారం ప్రకటించి నెల రోజులు దాటుతున్నా, ఇంతవరకు ఎలాంటి పరిహారం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.25,000 నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
వరద బాధితులను ఆదుకుంటామని చెప్పి నెల రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా విడుదల చేయలేదు అని మండిపడ్డారు. ఇంచార్జ్ మంత్రి సీతక్కకు పట్టింపు లేదు, సీఎంకు సోయి లేదు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.