‘ప్రతి ఒక్కరూ తమ మాతృభూమిని, సంస్కృతిని, మాతృభాషను గౌరవించాలి. ఎందుకంటే అవి మనకు ఆనందాన్ని కలిగించేవి’
-ఋగ్వేదం
‘మాతృభాషను పదిలపరచుకోవడం ద్వారా వ్యక్తి తన ఉనికిని తానే నిలుపుకుంటారు. విద్య..గ్రామీణుల అవసరాలు తీర్చేదిగా ఉండాలి. విద్యా బోధన మాతృభాషలోనే జరగాలి. కొల్లగొట్టుకు తినే సామ్రాజ్యవాదులకు సహాయకారిగా ఉండకూడదు’
-మహాత్మా గాంధీ (1937)
భారతదేశంలో వాడుకలోకి వచ్చి న భాషలు 380. వీటిలో కొన్ని భాషల్లో వ్యాకరణం, సాహితీ సంపద ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, లిపిలేని మౌఖిక రూపంలో ఉన్నా, ప్రతి భాషా దాన్ని మాట్లాడే జాతికి అంతరాత్మ అవుతుంది. సమాజ భౌతిక వికాసానికి అనుమేయంగా భాషా సంపద అభివృద్ధి చెందుతుంది. ప్రతి భాషా తానున్న పరిస్థితుల రీత్యా ప్రామాణికమైనది గాను, ప్రపంచభాషా సంపదలో తనదైన ముద్రతోనూ ఉంటుంది. ప్రపంచీకరణ పేరుతో కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు పరిమితమైన అభివృద్ధితో సాగే ప్రభుత్వాలు, పాలకవర్గాలు మాతృభాషల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నాయి. స్థానిక భాషలు అంతరించి పోతున్నాయి. జ్ఞానం ఎప్పుడూ స్థానికం నుంచి ప్రారంభమై విశ్వజనీనమవుతుంది. ఆ ప్రయాణానికి అతి ముఖ్యమైనది భాష.
మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష.. మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. ప్రపంచంలో మాట్లాడే భాషలన్నిటి కంటే మనం మన వ్యక్తిగత ప్రపంచంలో ఏ భాషలో మాట్లాడుతామో, ఏ భాషలో మన తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుంటామో, ఏ భాషలో పాఠశాల్లో తోటి విద్యార్థులతో మాట్లాడుతామో అదే మన మాతృభాష. ఆ భాషే మన భావోద్వేగాలు, జ్ఞాన అభివృద్ధికి ఉపయోగపడటంలో గణనీయమైన పాత్ర నిర్వహిస్తుంది. ‘నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది‘ అని చెప్పిన డబ్ల్యూబీ ఈట్స్ మాటల్ని బట్టి మనది నాగరిక జాతి అవునో కాదో మనమే నిర్ణయించుకోవాలి. మాతృభాష అనేది జాతి మనుగడకు జీవగర్ర వంటిది. మాతృభాషను కాపాడుకోవడం అంటే వారసత్వాన్ని నిలుపుకోవడం వంటిదేనని చెప్పవచ్చు. ఇక పరిపాలన నిర్వహణలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాషనే అధికార భాష అవుతుంది.
మన మాతృభాష తెలుగుకు సంబంధించి సంధి దశలో ఉన్నాం. ఇప్పటికైనా కండ్లు తెరువకపోతే పరిస్థితి చేయి దాటిపోక తప్పదు. పద సంపదను, సాహితీ సొబగులను, వ్యాకరణ పారిజాతాలను, పలుకుబడులను పట్టించుకోకపోతే వాటి ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ప్రామాణికీకరణను పక్కన పెడితే తక్షణం భాషా స్థిరీకరణ చేసుకోవాలి. ఉన్నదున్నట్టు కాపాడుకోవడంపై శ్రద్ధ వహించాలి. వారసత్వ సంపదగా వస్తున్న వ్యాకరణం, ఉచ్ఛారణ, సాహిత్య సంపద ఒకచోట చేర్చి సంస్కృతిని పరిరక్షించాలన్నది మనందరి కనీస కర్తవ్యం. రాతప్రతుల్లో గ్రంథాలయాల్లోనే నిక్షిప్తమైన తెలుగు భాషాసంపదను కంప్యూటరీకరిస్తే భాషను స్థిరీకరించుకోవచ్చు.
ఘన చరిత్రను కలిగిన మన తెలుగు భాష క్రీస్తు పూర్వము నాలుగు వందల నుంచి వాడుకలో ఉన్నది. తెలుగు భాషను మాట్లాడుతున్నప్పుడు మన శరీరంలో 72,000 న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయి. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో కన్నా ఇదే ఎక్కువ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అదేవిధంగా 2012లో ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ ప్రపంచంలో రెండవ ఉత్తమ లిపిగా తెలుగు భాష ఎన్నికయింది. కానీ విచారకరమైన విషయమేమంటే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాషాభివృద్ధిలో కీలకమైన విద్యా రంగంలో మాత్రం పరిస్థితి నిరాశాజనకంగానే ఉన్నది. విద్యారంగంలో తెలుగు వినియోగం పడిపోవడానికి కారణం ప్రపంచీకరణనే.
విద్యార్థులు ఏ శాస్త్రమైనా, ఏ ఇతర భాషలైనా నేర్చుకోవడానికి మాతృభాషా మాధ్యమమే సరైనదని శాస్త్రవేత్తలు తేల్చారు. జపాన్, ఐర్లాండ్, చైనా సహా పలు దేశాలు మాతృభాషలో విద్యాబోధన అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. నేడు ‘బహుళ భాషల సమాజాల మనుగడ వాస్తవమైనా మాతృభాషా పరిరక్షణ తప్పనిసరి అవుతుంది’ అని 2012 ఫిబ్రవరి 21న అప్పటి యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరీనా బొకోవా ప్రకటించారు. నేటి కాలంలో మానవ సంస్కృతిలో యాంత్రికత ప్రబలిపోతున్న కారణంగా మనిషిలోని మానవత్వానికి ప్రతీకలుగా నిలిచే భాషా, సాహిత్యం, కళలు వంటివి ప్రగతి పేరుతో ప్రపంచీకరణ మోజులో పడిపోతూ సాంస్కృతికతను కోల్పోతుండటం శోచనీయం.
ప్రాథమిక విద్యాస్థాయిలో మాతృ భాషా మాధ్యమం అనివార్యమైన అవసరమని రాజ్యాంగం (అధికరణం 350 ఏ), మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతను 1964-66 నాటి కొఠారీ కమిషన్ తెలియజేశాయి. 2010లో కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం విభాగం 29 (2)లో ప్రాథమిక స్థాయిలో వీలైనంత వరకు మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేయాలని నిర్దేశించింది. నూతన జాతీయ విద్యా విధానం (2020) కూడా ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని సూచించింది.
తెలుగు భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి చెప్పినట్టు ఐదో తరగతి వరకు మాతృభాషలోనే అన్ని అంశాలు బోధించాలి. ఆరో తరగతి నుంచి ఒక పాఠ్యాంశంగా ఆంగ్లం నేర్పడం, ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు విజ్ఞాన శాస్ర్తాలు, సాంకేతిక విషయాలు ఏటా ఒక సబ్జెక్టును ఆంగ్లంలో ప్రవేశపెట్టాలి. అప్పుడు అవగాహన బాగా పెరిగి ఉన్నత తరగతులకు వెళ్లినప్పుడు ఉభయ మాధ్యమాలకు అలవాటు పడుతారు. వీటిని అమలు చేస్తే తెలుగు చిన్నారుల నైపుణ్యాలకు ఆకాశమే హద్దుగా ఉంటుంది. మాతృభాష వచ్చిన తర్వాత అవకాశం, అవసరం, ఇష్టాన్ని బట్టి ఇతర భాషలు నేర్చుకోవడం సులభతరం అవుతుంది. ఐక్యరాజ్యసమితి 2019 సంవత్సరాన్ని అంతర్జాతీయ స్వదేశీ భాషల సంవత్సరంగా ప్రకటించింది. కనుమరుగయ్యే స్థితిలో ఉన్న భాషలను పరిరక్షించుకోవాలన్నది ఆ నిర్ణయం వెనుక ఉద్దేశం.
పాఠశాల యందు పాఠ్యాంశ బోధన
మాతృభాష లోనె మధుర మవుచు
కన్న ప్రేమలోని కమ్మదనము బంచి
బాల బాలికలకు భవిత నొసగు
మాతృభాషలోని మాధుర్యము నెరిగి
ఆత్మశుద్ధి తోడ ఆదరించు
పరులభాషలోన పలుకుట యేలరా
నీదు భాష గూర్చు నీకు ఘనత
– నమిలికొండ సునీత