Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మాతలు వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, ప్రముఖ ఛాయాగ్రాహకుడు రత్నవేలు విజువల్స్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. విడుదలైన మొదటి రోజే ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా రూ.135.36 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రెండో రోజు రూ.46.44 కోట్లు, మూడో రోజు రూ.54.90 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, తొలి మూడు రోజుల్లోనే రూ.236.7 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది.
ఆదివారం కూడా అదే జోరు కొనసాగించిన ‘పెద్ది’ మొదటి వీకెండ్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.292.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ, సినిమాను ‘బాక్సాఫీస్ ఛాంపియన్’గా అభివర్ణించింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి కీలక మార్కెట్లలో రామ్ చరణ్‌కు ఉన్న క్రేజ్ మరోసారి ఈ వసూళ్ల ద్వారా స్పష్టమైంది. నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.300 కోట్లకు చేరువైన ఈ సినిమా, వీక్‌డేస్‌లో కూడా ఇదే స్థాయిలో కలెక్షన్లు కొనసాగిస్తే త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ‘అచ్చీయమ్మ’ పాత్రలో నటించారు. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలకమైన కోచ్ పాత్రలో కనిపించగా, జగపతిబాబు ‘అప్పలసూరి’గా, దివ్యేందు శర్మ మరో ముఖ్యమైన పాత్రలో నటించారు. అయితే సినిమా విడుదల తర్వాత జాన్వీ కపూర్ పాత్రపై సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించగా, సీనియర్ నటుడు జగపతిబాబు జాన్వీకి బహిరంగ మద్దతు తెలిపారు. దర్శకుడు చెప్పిన విధంగానే ఆమె తన పాత్రను పోషించిందని, నటీనటులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.