Hamim Mondal : పాకిస్థాన్ (Pakistan) కు చెందిన జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్న హమీమ్ మోండల్ (Hamim Mondal) అనే వ్యక్తిని, అతడికి సహకరించిన యువతిని బెంగాల్ పోలీసులు (Bengal Police) అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (Spectial Taks Force) అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనల్లో అల్లర్లు సృష్టించాలని, బెంగాల్ సీఎం (Bengal CM) సువేంధు అధికారి (Adhikari) ని లక్ష్యంగా చేసుకోవాలని నిందితులు ప్రణాళికలు రచించినట్లు గుర్తించామన్నారు.
పోలీసు యూనిఫామ్‌లో నిరసన ప్రదేశంలోకి ప్రవేశించి అల్లర్లు సృష్టించాలని జైషే గ్రూప్ నుంచి హమీమ్‌కు ఆదేశాలు అందాయని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం కొంతమంది మహిళలు, పురుషులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అయితే వారు జంతర్‌మంతర్ వద్దకు వెళ్లారా లేదా..? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉగ్ర హ్యాండ్లర్లతో వారు చేసిన చాట్లను పరిశీలిస్తున్నామన్నారు. సువేందు అధికారి ఏ ప్రదేశంలో పోలీసుల బందోబస్తు లేకుండా ఉంటారనే సమాచారాన్ని సేకరించాలని కూడా వారు నిందితులను ఆదేశించారన్నారు.
బెంగాల్‌లోని రాజకీయ నేతలకు వలపువల విసిరేందుకు హమీమ్‌కు సహకరించిన జార్ఖండ్ యువతి అర్పిత సర్కార్ అతడి ప్రియురాలేనని అధికారులు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం వారికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. చిన్నస్థాయి నేతలను పరిచయం చేసుకొని.. వారి ద్వారా ప్రముఖ నేతలపై నిఘా పెట్టడం, తమ వారిని రాజకీయ పార్టీల్లో కార్యకర్తలుగా నియమించడం వంటి పనులకు హమీమ్ ఆమెను వినియోగించుకునేవాడు. బెంగాల్ మంత్రి ఉమేష్ రే కుమారుడిని హనీట్రాప్‌తో కిడ్నాప్ చేసి, వారి కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేయడానికి వీరిద్దరూ కుట్రపన్నారు.
రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలతో యువతికి సంబంధాలు ఉన్నాయని, వారి సమాచారాన్ని ఆమె హమీమ్‌కు చేరవేసిందని అధికారులు పేర్కొన్నారు. నిందితులు ఇద్దరు పలు ఎన్క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా పాకిస్థాన్ హ్యండ్లర్లతో కొన్నేళ్లుగా టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. యూకే, మెక్సికోలకు చెందిన అంతర్జాతీయ సిమ్‌కార్డులు వారి వద్ద లభ్యమయ్యాయి. దేశంలో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి, ఉగ్రవాద నియామకాలు వంటి కార్యకలాపాలకు పాల్పడటానికి హ్యాండ్లర్లు వీరిని ఉపయోగించుకున్నారు.