హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : యువ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్‌లతో పాటు ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడం నేటి ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అత్యంత ఆవశ్యకమని, ఇవే దేశ ప్రగతికి అసలైన చోదక శక్తులని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో వైభవంగా జరిగిన ‘టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ హైదరాబాద్ 2026’ 12వ ఎడిషన్ ప్రదానోత్సవ కార్యక్రమానికి శనివారం రాత్రి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
సినీ నటుడు అకినేని నాగచైతన్య, భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌తో కలిసి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యాపారవేత్తలు, సంస్థల ప్రతినిధులకు ఆయన అవార్డులు ప్రదానం చేశారు. నేటి యువత కేవలం ఉద్యోగాలు వెతుకునే వారిగానే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే జాబ్ ప్రొవైడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. అందుకు స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది ఎంఎస్ఎంఈ రంగమేనని గుర్తుచేశారు.సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆలోచనలతో యువ పారిశ్రామికవేత్తలు మారెట్లోకి వచ్చినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా దూసుకుపోతుందని స్పష్టంచేశారు.
మెరుగైన సమాజం కోసం సరికొత్త ఆవిషరణలు : నాగచైతన్య
సినీ నటుడు అకినేని నాగచైతన్య మాట్లాడుతూ మెరుగైన సమాజం కోసం వ్యాపార రంగంలో సరికొత్త ఆవిషరణలు (ఇన్నోవేషన్స్) అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని తెలిపారు. వ్యాపారాలు అంటే కేవలం లాభార్జనే కాకుండా, సమాజానికి, పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన నమూనాలే భవిష్యత్తులో విజయవంతమవుతాయని పేరొన్నారు. తాను సినీ రంగంలో కొనసాగుతూనే, రెండేండ్లుగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రయాణాన్ని ప్రారంభించానని, మారెట్లోకి కొత్త ఉత్పత్తిని, ఆలోచనను విజయవంతంగా తీసుకెళ్లడానికి ఆవిషరణలే మూలస్తంభాలని
వెల్లడించారు.
తెలంగాణ సమగ్రాభివృద్ధికి టైమ్స్ కృషి
తెలంగాణ సమగ్రాభివృద్ధికి వివిధ రంగాల ద్వారా విశేష కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే ఈ టైమ్స్ బిజినెస్ అవార్డుల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కాగా పరిశ్రమలు, ఐటీ, వైద్య ఆరోగ్య సంరక్షణ, విద్య, రియల్ ఎస్టేట్, తయారీ, సేవా రంగం, సామాజిక సేవ విభాగాల్లో విశేష ప్రతిభ చూపిన వారిని సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు అవార్డు గ్రహీతలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారి విజయాలు సమాజంలోని యువ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు. టైమ్స్ బిజినెస్ అవార్డుల వంటి ప్రతిష్టాత్మక గుర్తింపు తమపై బాధ్యతను మరింత పెంచిందని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో మునుపటి కంటే మరింత నిబద్ధతతో పనిచేస్తామని స్పష్టంచేశారు.