Munipalle | మునిపల్లి, ఆగస్టు 02: గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు ఉపశమనం లభించింది. ఎండిపోతున్న చేన్లను చూసి దిగులుపడ్డ రైతుల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న పదును వర్షాలు ఆనందాన్ని నింపాయి. ‘హమ్మయ్య.. వర్షాలు పడుతున్నాయి, ఈసారి పంటలు బాగా పండుతాయి’ అని పల్లెల్లో రైతులు మురిసిపోతున్నారు. తదితర పంట పొలాల్లో మందులు వేయడం, కలుపు తీయడం, మసాలా వేయడం వంటి పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. కాగా సాగుకు వర్షాలు ఎంత అవసరమో కూలీలు కూడా అంతే అవసరమయ్యారు. మునిపల్లి మండలంలో అధిక సంఖ్యలో ప్రజలు వ్యవసాయం చేయడంతో కూలీలు దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను ఆటోల్లో తోలుకొచ్చి పొలాల్లో గడ్డి, కలుపు తీయిస్తున్నారు. దీనివల్ల రైతులకు అదనపు భారం పడుతుండటంతో పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చవుతున్నాయని లోలోపల కుమిలిపోతున్నారు.
ఓ వైపు రైతులు పొలం పనుల్లో నిమగ్నమై ఉంటే.. మరోవైపు మునిపల్లి మండల వ్యవసాయాధికారి జాడేక్కడంటూ రైతుల నుంచి పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. మునిపల్లి మండలంలో మొత్తం 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అధిక సంఖ్యలో రైతులు రకరకాల పంటలు పండిస్తున్నారు.
పంటలు పండించే సమయంలో మండల వ్యవసాయాధికారి అందుబాటులో లేకపోవడంపై విధుల్లో నిర్లక్ష్యమని మండలవాసులు ఆరోపిస్తున్నారు. మండలంలో ఎక్కడో ఒక్క చోట గ్రామంలో పంటలు పరిశీలిస్తున్నట్లు ఫోటోలు దిగుతున్నారు తప్ప రైతులకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వడం లేదంటున్నారు.
మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) సైతం ప్రభుత్వం నుంచి ఏమైనా సూచనలు వస్తే ఆ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నారు తప్ప, రైతులకు వ్యవసాయ అధికారుల నుంచి ఎలాంటి సూచనలు, సలహాలు అందడం లేదని రైతులు వాపోతున్నారు.
పంటలు పండించే సమయంలో సంబంధిత అధికారులు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి, రైతులు ఏ ఏ పంటలు పండిస్తున్నారో తెలుసుకొని సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
మునిపల్లి మండలంలో ఫెర్టిలైజర్ దుకాణాలు ఊరికోటి దర్శనమిస్తున్నాయి. అనుభవం ఉన్నా, లేకపోయినా వారు ఫెర్టిలైజర్ దుకాణాలు ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నట్లు సమాచారం. ఏ పంటకు ఏ మందులు రైతులకు ఇవ్వాలో అనుభవం లేనివారు సైతం దుకాణాలు నడుపుతుండటం గమనార్హం.
మండల వ్యవసాయాధికారి నిర్లక్ష్యంతో మండలంలోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వెళ్ళిపోతున్నారు తప్ప మార్పు ఏమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, రైతు వేదికలకు పరిమితమైన మండల వ్యవసాయాధికారులపై తగు చర్యలు తీసుకోవాలని, అధికారులు మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని మునిపల్లి మండల రైతులు కోరుతున్నారు.
