‘ఈ నెల 9న సినిమా విడుదలవుతుందని మేమంతా ఎంతో నమ్మకంతో ఉన్నాం. అందుకే ఓవర్సీస్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశాం. కానీ, నిన్న ఉదయానికి కూడా ఓవర్సీస్ సెన్సార్‌కి కంటెంట్ ఇవ్వలేని పరిస్థితి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పరంగా కూడా మూడ్నాలుగు రోజులు వెనుకబడిపోయాం. ఈ పరిస్థితుల్లో సినిమాను కంగారుగా విడుదల చేసేకంటే, ఒకట్రెండు సార్లు చెక్ చేసుకొని, క్వాలిటీ అవుట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ‘ఆదర్శకుటుంబం’ సినిమాను వాయిదా వేస్తున్నాం. రెండుమూడు వారాల తర్వాత సరైన తేదీ చూసుకొని, వెంకటేశ్‌గారితో చర్చించి కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
వెంకటేశ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘ఆదర్శకుటుంబం హౌస్ నెం.47 – AK 47’. ఈ నెల 9న విడుదల కావాల్సిన ఈ సినిమా, పోస్టు ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. విడుదల కాస్త ఆలస్యమైనా.. వెంకటేశ్ అభిమానులంతా నూటికి నూరు శాతం సంతృప్తి చెందేలా సినిమాను తీసుకొస్తామని, మధ్య తరగతి వ్యక్తిగా వెంకటేశ్ నటన సినిమాకు హైలైట్‌గా ఉంటుందని, కుటుంబ భావోద్వేగాలు, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆసక్తిగా సాగుతుందని నాగవంశీ చెప్పారు. శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావురమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాణం: హారికా అండ్ హాసిని క్రియేషన్స్.