Spider-Man | హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హోలాండ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం ఊహించని విధంగా ఏకంగా రూ. 5,725 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇందులో ఒక్క ఓవర్సీస్ మార్కెట్ల నుంచే సుమారు రూ. 2,900 కోట్లు రావడం విశేషం. ఇక భారత్‌లోనూ ఈ సినిమాకు ఊహించని స్థాయి స్పందన లభిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే భారత్‌లో ఈ చిత్రం రూ. 180.20 కోట్ల నెట్, రూ. 215.48 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి దూసుకుపోతోంది. తొలి రోజు గురువారం రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ సినిమా ప్రయాణం, శుక్రవారం చిన్నపాటి డ్రాప్ చూసినప్పటికీ, శనివారం భారీ వసూళ్లతో అద్భుతమైన పునరుజ్జీవనం పొందింది. కేవలం శనివారం ఒక్కరోజే భారత్‌లో రూ. 70.25 కోట్ల నెట్, రూ. 84.01 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
ఈ భారీ వసూళ్లతో బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ చిత్రాల తొలి మూడు రోజుల కలెక్షన్ల రికార్డులను ఈ హాలీవుడ్ చిత్రం అధిగమించింది. ఇంతకుముందు ‘పఠాన్’ మూడు రోజుల్లో రూ. 161 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా, ‘టైగర్ 3’ రూ. 144 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టగలిగాయి. అయితే, టామ్ హోలాండ్ సినిమా మాత్రం సులభంగా ఆ రికార్డులను వెనక్కి నెట్టింది. అంతేకాకుండా, గతంలో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ పేరిట ఉన్న హాలీవుడ్ తొలి రోజు కలెక్షన్ల రికార్డును కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది. డెస్టిన్ డానియల్ క్రీటన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జెండయా, సేడీ సింక్, జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫలో తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.