AB De Villiers | ఆసియా కప్ ఫైనల్ వివాదం ఇంకా కొనసాగుతుతూనే ఉన్నది. ఈ వివాదంలోకి దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతో అభిమానులు మాజీ క్రికెటర్‌పై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్లో డబ్బులు సంపాదించేందుకు భారత్ వస్తాడని.. భారతీయుల గురించి అతనికేం తెలుస్తుందంటూ మండిపడ్డారు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి భారత టైటిల్‌ను గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఏసీసీ చైర్మన్‌గా ఉన్న నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకునేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ముందస్తుగా సమాచారం అందించినా నఖ్వీ సిగ్గులేకుండా ట్రోఫీని అందించేందుకు వేదికపైకి చేరుకోగా.. భారత ఆటగాళ్లు స్టేజ్‌పైకి వెళ్లేందుకు నిరాకరించారు. ఆ తర్వాత ఆసియా కప్ ట్రోఫీని తీసుకొని వెళ్లిపోయారు.
అయితే, ఈ వివాదంపై దక్షిణాఫ్రికా మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. టీమిండియా వైఖరి తనకు నచ్చలేదని పేర్కొన్నారు. అక్కడున్న వ్యక్తి నుంచి ట్రోఫీ తీసుకోవాలనుకోలేదని.. క్రీడల్లో అలాంటి భాగం కాకూడదని అనుకుంటున్నానని.. రాజకీయాలకు క్రీడలను దూరంగా ఉంచాలని.. ఆటను ఆటగా మాత్రమే చూడాలని.. అది చూసేందుకు బాధగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరుగకుండా సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నానని.. ఇది ఆటగాళ్లను అసౌకర్య స్థితిలో ఉంచుతుందని.. అతది తనది ఎక్కువగా బాధపెడుతుందని పేర్కొన్నాడు. చివరికి ఏర్పడిన వాతావరణం చాలా వింతగా ఉందని డివిలియర్స్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎక్స్ వేదికగా మాజీ దక్షిణాఫ్రికా ఆటగాడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డివిలియర్స్ కేవలం డబ్బు సంపాదన కోసం మాత్రమే భారత్‌కు వస్తాడని.. ఈ విషయంలో మద్దతు ప్రకటించడంలో ఇబ్బందిపడ్డాడని పేర్కొన్నారు. ఓ యూజర్ స్పందిస్తూ ఐపీఎల్లో రూ.కోట్లు సంపాదించేందుకు భారత్ వస్తాడని.. కానీ, భారత ఆటగాళ్ల భావాన్ని అర్థం చేసుకోవడం లేదని.. అందరూ రాజకీయాలను చూస్తారని విమర్శించాడు. మరో యూజర్ స్పందిస్తూ.. డివిలియర్స్‌కు భారత్ ఇలా ఎందుకు చేసిందో బహుశా తెలిసి ఉండకపోవచ్చని.. అందుకే తన అభిప్రాయాన్ని చెప్పి ఉంటాడన్నాడు.
మరో యూజర్ స్పందిస్తూ.. ఐపీఎల్ సమయంలో అతను డబ్బు సంపాదించడానికి భారతదేశానికి వస్తాడని.. సిగ్గులేని ఫ్రాంచైజీ అతనికి ఎలాంటి కారణం లేకుండా భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నాడని.. తాజాగా అతను బీసీసీఐ వైఖరిని విమర్శిస్తున్నాడని మండిపడ్డాడు. మరో యూజర్.. ఏబీ డివిలియర్స్ తన నిజ స్వరూపాన్ని చూపించాడని.. క్రికెట్‌ను రాజకీయాలతో కలపొద్దని అంటున్నాడని.. భారత్‌కు సలమా ఇచ్చేందుకు అతనెవరు? అందుకేనా ఒక్క కీలక ట్రోఫీని గెలువలేదంటూ ఘాటుగా స్పందించాడు. ఆర్సీబీ అభిమానులు అతనికి అంతటి ఉన్నత స్థాయి గుర్తింపును ఇస్తే.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని మరో యూజర్ ఆరోపించాడు. ఇదిలా ఉండగా.. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ స్వీకరించేందుకు టీమిండియా నిరాకరించింది. టీమిండియా ట్రోఫీ లేకుండా సంబరాలు చేసుకుంది. కొందరు భారత వైఖరిని సమర్థించగా, మరికొందరు విమర్శించారు. అయితే, విమర్శల మధ్య డివిలియర్స్ కూడా టీమిండియా అద్భుతమైన ప్రదర్శనను ప్రశంసించాడు. భారత జట్టు ప్రస్తుతం చాలా బలంగా కనిపిస్తోందని.. ఈ జట్టు రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం అద్భుతమైన సన్నాహాల్లో ఉందని పేర్కొన్నాడు డివిలియర్స్.