Viral news : సాధారణంగా చాలామంది ఆర్థికంగా ఓ మోస్తరు హోదాలో ఉంటే సంపాదన కోసం చిన్నచిన్న పనులు చేయడానికి సంకోచిస్తారు. నలుగురిలో చులకన అవుతామని భావిస్తారు. కొందరైతే తమకు తినడానికి తిండిలేకపోయిన చిన్నచితకా పనులు చేసుకుని బతికేవాళ్లను చులకనగా చూస్తుంటారు. కానీ అతడు మాత్రం ఇలాంటి వారికి భిన్నం. తనకు ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం వస్తుంది. అవసరమైతే కోట్ల పెట్టుబడితో వ్యాపారం చేయవచ్చు. అది వద్దనుకుంటే ఇంట్లో కూర్చుని తినొచ్చు. కానీ అతడు మాత్రం అలా చేయడం లేదు. మొదటి నుంచి అలవాటైన బిల్డింగులలో ఫ్లోర్ క్లీనర్ పని చేస్తున్నాడు.
కోట్ల ఆదాయం ఉన్నా నెలకు వేలల్లో వచ్చే జీతం కోసం ఫ్లోర్ క్లీనర్‌గా పనిచేస్తున్న ఆ కోటీశ్వరుడి పేరు కోయిచి మత్సుబారా (Koichi Matsubara). జపాన్ రాజధాని టోక్యోకు చెందిన మత్సుబారా చాలా తక్కువ వేతనానికి హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నాడు. మత్సుబారా వయస్సు ప్రస్తుతం 56 ఏళ్లు. అయినా అతను స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
అయితే వారంలో మూడు రోజులు, రోజుకు నాలుగు గంటల చొప్పున అతను పని చేస్తున్నారు. ఇందుకుగానూ ఆయనకు నెలకు సుమారుగా ఒక లక్ష యెన్ల జీతం వస్తున్నది. మన రూపాయల్లో అయితే అది దాదాపు రూ.60 వేలకు సమానం. టోక్యోలో సగటు నెల జీతం 3 లక్షల యెన్లతో పోల్చుకుంటే మత్సుబారా అందుకుంటున్నది చాలా తక్కువ అని చెప్పొచ్చు.