Yadagirigutta | యాదగిరిగుట్ట, అక్టోబర్ 4 : కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. మండలంలోని చొల్లేరు గ్రామంలో శుక్రవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దాంతో భువనగిరి ఎస్వోటీ పోలీసుల బృందం దాడులు నిర్వహించింది.
ఈ దాడిలో యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కానుగు బాలరాజుగౌడ్, తోటకూరి బీరయ్య, ఆత్మకూరు(ఎం) కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ వైస్ ఎంపీపీ భాషబోయిన పద్మ భర్త భాషబోయిన పాపయ్య, కాంగ్రెస్ పార్టీకి చెందిన వంగపల్లి పీఏసీఎస్ డైరక్టర్ గడ్డమీది శ్రీనివాస్ గౌడ్, నాయకులు చిన్నం శ్రీను, తొంతిసారం శంకర్‌తో పాటు మరో పలువురు ముఖ్యనాయకులు అరెస్టు చేసి యాదగిరిగుట్ట పోలీస్టేషన్‌కు తరలించారు. ఏ1గా కానుగు బాలరాజు, ఏ2గా తోటకూరి బీరయ్య, ఏతిగా గడ్డమీది శ్రీనివాస్, ఏ4గా దొంతిసారం శంకర్, ఏ5గా చిన్నం శ్రీను, ఏ6గా భాషబోయిన పాపయ్యను చేర్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు.
వీరి వద్ద నుంచి రూ.3000 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, 2 సెట్ల పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ పేకాటలో ఆత్మకూరు(ఎం) కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ తండ మంగమ్మ భర్త తండ శ్రీశైలం ఉన్నట్లుగా సమాచారం. అధికార పార్టీ ఆలేరు నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిడితో ఆయన పేరును కేసులో నుంచి తప్పించిన్నట్లు సమాచారం.