(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా చెప్పుకొనే చమురు ద్వీపం ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా భీకర దాడులు జరిపింది. దీనిపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్.. అమెరికా, దాని మిత్ర దేశాల చమురు కేంద్రాలను బూడిద చేస్తామని హెచ్చరించింది. సౌదీలోని అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ జరిపిన దాడుల్లో అమెరికాకు చెందిన ఐదు రీఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయి. దుబాయ్‌లోని ఆర్థిక భవనంతో పాటు ఇరాక్‌లోని అమెరికా ఎంబసీపై కూడా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇదే సమయంలో పశ్చిమాసియాలో అమెరికా ఏఐ ఆధారిత డ్రోన్ల దండును మోహరించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా గురించి సమాచారం ఇస్తే, రూ. 93 కోట్లు ఇస్తామని ప్రకటించింది.
ఇరాన్ చమురు హబ్ ‘ఖర్గ్’ ధ్వంసం
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన చమురు ద్వీపం ‘ఖర్గ్’పై తమ దేశానికి చెందిన యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు జరిపిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన దాడుల్లో ఇదొకటిగా అభివర్ణించిన ఆయన.. ఈ దాడుల్లో దీవిలోని సైనిక కేంద్రాలు అన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు. ప్రస్తుతానికైతే దీవిలోని చమురు మౌలిక సదుపాయాలపై దాడి చేయలేదన్న ట్రంప్.. హొర్ముజ్ జలసంధి వద్ద నౌకలను అడ్డుకొంటే వాటిని కూడా పేల్చేస్తామని ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. హొర్ముజ్ గుండా ప్రయాణించడానికి చమురు నౌకలకు ఎస్కార్ట్ సౌకర్యాన్ని త్వరలోనే కల్పిస్తామని పునరుద్ఘాటించారు. ఖర్గ్ ద్వీపంపై జరిగిన దాడులను ఇరాన్ ఖండించింది. ఖర్గ్‌లోని చమురు మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే.. అమెరికా, దాని మిత్రపక్షాలకు చెందిన చమురు కేంద్రాలను బూడిద కుప్పలుగా మార్చేస్తామని హెచ్చరించింది.
ఏమిటీ ఖర్గ్? ఎందుకంత ప్రాధాన్యం??
పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ తీరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ‘ఖర్గ్’ ఉంటుంది. 20 చదరపు కిలోమీటర్ల అతి తక్కువ వైశాల్యంతో ఉన్నప్పటికీ.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముకగా చెప్తారు. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతం వాటా దీనిదే. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, 2024లో ఈ ద్వీపం నుంచి చమురు ఎగుమతుల ద్వారా ఇరాన్ 78 బిలియన్ డాలర్లను ఆర్జించింది. దీన్ని బట్టి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నడవాలంటే ఇక్కడి చమురు ఎగుమతులే కీలకమన్న విషయం అర్థమవుతున్నది. ఖర్గ్‌లోని లోడింగ్ టెర్మినళ్లు రోజుకు ఏడు మిలియన్ బ్యారెళ్ల చమురును హ్యాండిల్ చేయగలవని నివేదికలు చెప్తున్నాయి. అందుకే, ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో ఖర్గ్పై ట్రంప్ సర్కార్ దాడులకు పాల్పడింది.
ఇరాన్ ప్రతీకార దాడులు
ఖర్గ్పై అమెరికా దాడులకు బదులుగా ఇరాన్ ప్రతిదాడులను ముమ్మరం చేసింది. సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఐదు రీ-ఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసం అయినట్టు సమాచారం. మరోవైపు, ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ మిసైల్స్‌తో విరుచుకుపడింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దయెత్తున పొగ వ్యాపించింది. ఈ దాడిలో హెలిప్యాడ్ ధ్వంసమైనట్టు సమాచారం. ఇంకోవైపు, దుబాయ్‌లోని ఓ ఫైనాన్షియల్ బిల్డింగ్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. యూఏఈలోనే అతిపెద్ద చమురు కేంద్రమైన ఫుజైరా పోర్టు లక్ష్యంగా చేసుకొని ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఖర్గ్‌లోని తమ చమురు కేంద్రాలపై దాడులు చేస్తే, అమెరికా సేనలను కిడ్నాప్ చేస్తామని హెచ్చరించింది. యూఏఈలోని పోర్టులకు పౌరులు దూరంగా ఉండాలని ఇరాన్ ఓ ప్రకటనలో తెలిపింది.

అమెరికా డ్రోన్ల దండు
ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో అమెరికా 10 వేల డ్రోన్లను మోహరించింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పనిచేసే ఈ ‘మెరోప్స్’ ఇంటర్‌సెప్టర్ డ్రోన్లకు.. శత్రువుల డ్రోన్లను వేటాడి కూల్చేసే సామర్థ్యం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇరాన్ ప్రయోగిస్తున్న షాహెద్ డ్రోన్లను అడ్డుకోవడానికే అమెరికా ఈ డ్రోన్లను వినియోగిస్తున్నట్టు సమాచారం. ఒక్కో షాహెద్ డ్రోన్ ఖర్చు 20 వేల డాలర్లు ఉండగా.. మెరోప్స్ డ్రోన్ తయారీ ఖర్చు 15 వేల డాలర్ల వరకూ ఉంటుందని అంచనా. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆచూకీ చెప్పిన వారికి 10 మిలియన్ డాలర్లు (రూ. 93 కోట్లు) ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఖమేనీతో పాటు, ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజాని, ఇరాన్ సీనియర్ మేజర్ జనరల్ యాహ్యా రహీమ్ సఫావీ, ఇరాన్ మంత్రులు ఎస్కాందర్ మొమేనీ, ఇస్మాయిల్ ఖాటిబ్పై కూడా నజరానా ప్రకటించినట్టు అమెరికా తెలిపింది.
నెతన్యాహు బతికే ఉన్నారా?
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే, ఆ వీడియోలో ఆయన కుడి చెయ్యికి ఆరు వేళ్లు ఉన్నట్టు స్పష్టమవుతున్నది. దీంతో ఇది నిజమైన వీడియోనేనా? ఏఐతో చేశారా? అసలు నెతన్యాహు ప్రాణాలతో ఉన్నారా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. ఇరాన్ శుద్ధిచేసిన యురేనియాన్ని రష్యాకు తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తీసుకొచ్చిన ప్రతిపాదనను ట్రంప్ తోసిపుచ్చినట్టు సమాచారం.