Sandhya Shantaram | హిందీ పరిశ్రమలో విషాదం నెలకొంది. అలనాటి హిందీ, మరాఠీ చిత్రాల ప్రముఖ నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూశారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె శనివారం (అక్టోబర్ 4, 2025) ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 94. సంధ్యా శాంతారామ్.. భారతీయ చలనచిత్ర దిగ్గజ దర్శకుడు, నిర్మాత అయిన దివంగత వి. శాంతారామ్ సతీమణి. ఆమె తన సినీ జీవితంలో ఎక్కువగా ఆయన దర్శకత్వంలోనే నటించారు. 1950, 60లలో హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించిన ఆమె.. ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ (Jhanak Jhanak Payal Baaje), ‘దో ఆంఖే బారా హాత్’ (Do Aankhen Barah Haath), ‘నవరంగ్’ (Navrang), మరాఠీ క్లాసిక్ చిత్రం ‘పింజ్రా’ (Pinjra) వంటి చిరస్మరణీయమైన చిత్రాల్లో తన నటన, నృత్య కౌశలంతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు.
ఇక సంధ్యా శాంతారామ్ మృతితో బాలీవుడ్, మరాఠీ సినీ పరిశ్రమల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలిపారు. శనివారం ముంబైలోని శివాజీ పార్క్ ప్రాంతంలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.