Actor Mohanlal | భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకున్న మలయాళ దిగ్గజ నటుడు మోహన్‌లాల్‌ను కేరళ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. మలయాళం వానోళం, లాల్ సలాం(Malayalam Vaanolam, Laal Salam) పేరుతో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్య అతిథిగా హాజరై మోహన్‌లాల్‌ను సత్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ మోహన్‌లాల్‌ను ప్రతి మలయాళీకి గర్వకారణంగా అభివర్ణించారు. మలయాళ సినిమా కళాత్మకంగా, వాణిజ్యపరంగా ఎదగడంలో మోహన్‌లాల్ పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. 2004లో లెజెండరీ ఫిల్మ్ మేకర్ అడూర్ గోపాలకృష్ణన్ తర్వాత, రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కేరళకు ఈ అత్యున్నత గౌరవాన్ని మోహన్‌లాల్ తీసుకురావడం గొప్ప విషయమన్నారు.
సన్మానం అందుకున్న అనంతరం మోహన్‌లాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో అవార్డు అందుకోవడం కంటే తాను పుట్టి పెరిగిన స్వస్థలంలో, సొంత ప్రజలు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కడం తనకు మరింత భావోద్వేగాన్ని కలిగించిందని తెలిపారు. ఈ గాలి, ఈ ప్రదేశాలు, ఈ జ్ఞాపకాలు నా ఆత్మలో భాగం. ఇలాంటి భావోద్వేగాలను నటించలేం” అని ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డు మలయాళ చిత్ర పరిశ్రమకు, తనను ఆదరించిన ప్రేక్షకులందరికీ అంకితమని మోహన్‌లాల్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రముఖ సినీ, సాంస్కృతిక ప్రముఖులు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. ఈ వేడుకలో మోహన్‌లాల్ నటించిన చిత్రాల పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మోహన్‌లాల్ సెప్టెంబర్ 23, 2025న ఢిల్లీలో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.