S Jaishankar : భారత విదేశాంగ మంత్రి (Indian Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) బ్రస్సెల్స్ (Brussels) వేదికగా దాయాది పాకిస్థాన్ (Pakistan) పై విమర్శలు చేశారు. పాకిస్థాన్.. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ఆరోపించారు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు సమస్య కంటే ఉగ్రవాదమే (Terrorism) పెద్ద సమస్య అని ఆయన చెప్పారు.
యూరోపియన్ యూనియన్ (EU) నాయకులను కలిసేందుకు బ్రస్సెల్స్ వెళ్లిన మంత్రి జైశంకర్ అక్కడి మీడియాతో మాట్లాడారు. భారత్-ఈయూ బంధం భవిష్యత్తులో మరింత బలపడుతుందని తాను ఆశిస్తున్నానని అన్నారు. చర్చల ద్వారా ఈయూతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్థాన్‌పై దాడికి పాల్పడటాన్ని అప్పట్లో అంతర్జాతీయ మీడియా తప్పుపట్టింది. ఈ అంశంపై కూడా జైశంకర్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య తాజా సంఘర్షణలకు కారణం సరిహద్దు సమస్య కాదని, ఉగ్రవాద సమస్య అని అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని విమర్శించారు.
పాకిస్థాన్ ఉగ్రవాదులకు సురక్షిత ప్రదేశం కాబట్టే అక్కడి మిలిటరీ ఏరియాల్లో ఏళ్లుగా ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని జైశంకర్ ఆరోపించారు. ఆ దేశం ఉగ్రవాదులకు సురక్షితం కాకపోతే ఒసామా బిన్ లాడెన్ అక్కడే ఎందుకు దాక్కుంటాడని ప్రశ్నించారు. అంతర్జాతీయ మీడియా, సమాజం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని తాను ఆశిస్తున్నానని అన్నారు.