Meghalaya murder : రాజా రఘువంశీ హత్య ఇప్పుడు దేశమంతటా సంచలనంగా మారింది. హనీమూన్ పేరుతో భార్య అతడిని మేఘాలయకు తీసుకెళ్లి కిరాయి హంతకులతో హత్య చేయించింది. పెళ్లయిన 10 రోజులకే మే 20న రాజా రఘువంశీ, సోనమ్ దంపతులు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి హనీమూన్‌కు బయలుదేరారు.
మే 23న మధ్యాహ్నం రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్య జరగడానికి ముందు జరిగిన కీలక పరిణామాలపై పోలీసులు ఆరా తీశారు. ఆ పరిణామాల ఆధారంగా కేసును పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. హత్యకు ముందు సోనమ్ దంపతలను కిరాయి హంతకులు ఎక్కడ కలిశారు..? ఎలా హత్య చేశారు..? అనే వివరాలను సేకరించారు.
పోలీస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రాజా రఘువంశీ హత్యకు ముందు జరిగిన పరిణామాలు ఈ విధంగా ఉన్నాయి.
– మే 20న హనీమూన్ ట్రిప్‌లో భాగంగా ఇంటి నుంచి బయలుదేరిన రాజారఘువంశీ దంపతులు ముందుగా గువాహటిలో కామాఖ్య ఆలయానికి వెళ్లి, అక్కడి నుంచి మే 21న షిల్లాంగ్ చేరుకున్నారు.
– అదేరోజు ముగ్గురు కిరాయి హంతకులు ఆకాశ్, ఆనంద్, వికాస్ ఇండోర్ నుంచి వేర్వురు ట్రాన్స్పోర్ట్ మోడ్స్‌లో షిల్లాంగ్‌కు చేరారు. ఎవరూ గుర్తించకుండా ఉండటం కోసం ఇలా చేశారు.
– మే 23న రాజా రఘువంశీ, సోనమ్ దంపతులు చిరపుంజిలో ట్రెక్కింగ్‌కు బయలుదేరారు. అప్పటికే రెండు రోజులుగా వారిని అనుసరిస్తున్న ముగ్గురు కిరాయి హంతకులు రాజా రఘువంశీతో మాట కలిపారు. ఇండోర్‌లో వారివి చూసిన ముఖాలు కావడంతో రాజా వారితో కలిసిపోయారు.
– ఈ గుంపు అంతా కలిసి వెళ్తుండగా ఉదయం 10 గంటల సమయంలో స్థానిక గైడ్ ఆల్బర్ట్ వారిని పలకరించాడు. హిందీలో మాట్లాడుకుంటూ వెళ్తున్న వాళ్లు గైడ్ సేవలు కావాలా అని ఆల్బర్ట్ అడుగగా.. అవసరం లేదని చెబుతూ వెళ్లిపోయారు.
– కొంచెం నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి వెళ్లగానే రాజా రఘువంశీ భార్య సోనమ్ అలసట సాకుతో మెల్లగా నడుస్తూ వెనుకబడింది. హత్య కుట్ర తెలియని రాజా ఆ ముగ్గురితో మాట్లాడుతూ కొంత ముందుకు వెళ్లాడు. అదే అదునుగా భావించిన సోనమ్ ‘అతడిని చంపేయండి’ అని గట్టిగా అరిచింది. వెంటనే ముగ్గురూ దాడిచేసి రాజాను హతమార్చారు.
– ముందుగా ఒకరు రాజాపై దాడిచేయగా ఆ తర్వాత మిగిలిన ఇద్దరు కూడా అతడితో జతకలిశారు. పదునైన ఆయుధంతో తల ముందు, వెనుక నరికారు. ఆ తర్వాత మృతదేహాన్ని లోయలో పడేశారు. మృతదేహాన్ని లోయలో పడేయడంలో హంతకులకు సోనమ్ కూడా సహకరించింది.
– ఆ తర్వాత సోనమ్‌ను ట్యాక్సీ ఎక్కించి మాకడోక్ నుంచి షిల్లాంగ్ పంపించారు. సోనమ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గువాహటికి అక్కడి నుంచి రైలులో ఇండోర్‌కు వెళ్లింది. మిగతా ముగ్గురు నిందితులు కూడా మరో ట్యాక్సీలో గువాహటికి చేరుకుని, అక్కడి నుంచి వేర్వేరు రైళ్లలో ఇండోర్‌కు వెళ్లారు.
– అయితే సోనమ్ ప్రియుడు, హత్యకు ప్రధాన సూత్రధారి అయిన రాజ్ కుశ్వాహ మేఘాలయకు నేరుగా వెళ్లలేదు. ఇండోర్‌లోనే ఉండి అడుగడుగున సోనమ్‌కు, కిరాయి హంతకులకు మధ్య కోఆర్డినేట్ చేశాడు.