న్యూఢిల్లీ: పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా(Sidhu Moosewala)పై రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని ఇవాళ బీబీసీ వరల్డ్ సర్వీస్ తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఇవాళ మధ్యాహ్నం ముంబైలో ఆ డాక్యుమెంటరీని స్క్రీనింగ్ కూడా చేయనున్నారు. ఇవాళ మూసేవాలా జయంతి సందర్భంగా ఆ డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తున్నారు. స్క్రీనింగ్‌పై స్టే విధించాలని పంజాబ్‌లోని మానసా కోర్టులో మూసేవాలా తండ్రి పిటీషన్ ఫైల్ చేశాడు. సిద్దూ మూసేవాలాకు చెందిన పాటలను అతని కుటుంబం రిలీజ్ చేయనున్నది. 1993, జూన్ 11వ తేదీన మూసేవాలా జన్మించాడు.
డాక్యుమెంటరీకి చెందిన రెండు ఎపిసోడ్లను బీబీసీ రిలీజ్ చేసింది. వాటిల్లో మూసేవాలా పాత స్నేహితులు, జర్నలిస్టులు, సీనియర్ పోలీసు ఆఫీసర్ల అభిప్రాయాలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో జరిగిన ఆడియో ఇంటర్వ్యూ కూడా ఆ వీడియోలో ప్రజెంట్ చేశారు. సిద్దూ మూసేవాలా.. 2022 మే 29వ తేదీన హత్యకు గురయ్యాడు. అతని హత్య కేసులో గోల్డీ బ్రార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
సిద్దూ మూసేవాలా డాక్యుమెంటరీకి ద కిల్లింగ్ కాల్ అనే టైటిల్ ఇచ్చారు. మూసేవాలా చిన్నతనం, ఎలా పైకి ఎదిగారు, అతని కెరీర్‌ను చట్టుకున్న వివాదాలపై డాక్యుమెంటరీలో ఫోకస్ చేశారు. కారులో వెళ్తున్న సిద్దూ మూసేవాలాను వెంబడించి, ఎలా కిరాయి హంతకులు అతన్ని హత్య చేశారో యూట్యూబ్ వీడియోలో చూపించినట్లు తెలుస్తోంది. ఆ హత్యకు కారణమైన గోల్డీ బ్రార్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.