Meghalaya murder : రాజా రఘువంశీ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మేఘాలయ పోలీసులు కేసులో ప్రధాన నిందితురాలిగా రాజా రఘువంశీ భార్య సోనమ్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి, రఘువంశీపై దాడిచేసి హతమార్చిన కిరాయి హంతకులను మధ్యప్రదేశ్ నుంచి ట్రాన్సిట్ రిమాండ్‌పై షిల్లాంగ్‌కు తీసుకొచ్చి సదార్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు.
ఘటనా ప్రాంతంలో రక్తపు మరకలతో దొరికిన షర్టును, కత్తిని, రెయిన్ కోటును స్వాధీనం చేసుకున్న పోలీసులు పరీక్షల ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ పరీక్షల్లో షర్ట్‌పై ఉన్న రక్తపు మరకలు రాజా రఘువంశీవేనని తేలింది. రెయిన్ కోర్టుపైన, కత్తిపైన ఉన్న రక్తపు మరకలను పరీక్షించాల్సి ఉంది. రక్తపు మరకలు ఉన్న షర్ట్ నిందితుల్లో ఒకడైన ఆకాశ్దిగా పోలీసులు గుర్తించారు.
హత్య సమయంలో ఆకాశ్ షర్ట్‌పై రక్తపు మరకలు పడటంతో అక్కడే తీసేశాడని, ఆ తర్వాత సోనమ్ తన రెయిన్‌కోట్‌ను ఆకాశ్‌కు ఇచ్చిందని, ఘటనా ప్రాంతం నుంచి ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఆకాశ్ రెయిన్‌కోట్‌ను తీసేసి వేరే దుస్తులు ధరించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అదేవిధంగా నిందితుల్లో ఒకడైన ఆనంద్ అరెస్ట్ సమయంలో ధరించిన షర్ట్‌పై కూడా రక్తపు మరకలు ఉన్నాయని, ఆ షర్ట్‌ను కూడా పరీక్షలకు పంపామని, రిపోర్టు రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మే 23 నుంచి ఆ జంట ఆచూకీ లేకుండా పోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ 2న ఉత్తర కాసీ కొండల్లోని లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం కనిపించింది. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుల నుంచి పలు వివరాలు రాబడుతున్నారు.