హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): టెండర్పై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అందులో ఏదై నా పక్షపాతం, దురుద్దేశం, విధానపరమైన అక్రమాలు ఉంటే తప్ప హైకోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టంచేసింది. గతంలో ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్ రద్దుచేసి కొత్త నోటిఫికేషన్ జారీచేసే అధికారం టెండరింగ్ అథారిటీ కి ఉంటుందని పేరొన్నది. వివరాల్లోకి వెళ్తే.. గోదావరి పుషరాల కోసం వేములవాడను కలుపుతూ రూ.50 కోట్ల విలువైన రోడ్ల విస్తరణ పనులపై శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గతంలో విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. టెండర్ ప్రక్రియలో హైకోర్టు జోక్యం పరిమితంగా ఉంటుందని పేర్కొంటూ ఆ పిటిషన్ను కొట్టివేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీ దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాదనలను విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు లేవంటూ అప్పీలును కొట్టివేసింది.