ములుగు, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిసరాల్లో ఉన్న రెండు ఉప ఆలయాలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి ‘ఎక్స్’ ద్వారా తెలంగాణ వారసత్వానికి కేంద్రప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి జాతీయ గుర్తింపును ప్రకటించిందని పోస్టుచేశారు. కాకతీయ వైభవానికి అరుదైన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రామప్ప ఆలయ పరిసరాల్లోని శివాలయంతోపాటు గొల్లాలగుడిని కేంద్ర పురావస్తు శాఖ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా ప్రకటించిందని తెలిపారు. ఈ రెండు కట్టడాలతో కలిపి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉన్న స్మారక కట్టడాల సంఖ్య 10కి చేరిందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు జాతీయ గుర్తింపు ఉపయోగపడుతుందని తెలిపారు.