Jason Sanjay | తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న తొలి చిత్రం సిగ్మా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం తొలుత జూలై 30న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆగస్టుకు వాయిదా పడింది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉండగా, జాసన్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడిన జాసన్ సంజయ్, తండ్రి విజయ్ తనకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని చెప్పేవారని వెల్లడించారు.
నా కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని మా నాన్న ఎప్పుడూ కోరుకునేవారు. నేను కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. సహాయం కావాలంటే తప్పకుండా చేస్తానని చెప్పినా, ముందుగా నువ్వే ప్రయత్నించాలి, జీవితంలోని అనుభవాలను స్వయంగా ఎదుర్కొని నేర్చుకోవాలని ఆయన ఎప్పుడూ ప్రోత్సహించారు. నాపై నమ్మకం ఉంచిన మా నాన్న, అమ్మ, కుటుంబ సభ్యులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని జాసన్ తెలిపారు. ఇంటర్వ్యూలో జాసన్‌కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఒకవేళ హాలీవుడ్ స్టార్ జాసన్ స్టాథమ్ తనను సంప్రదించి, భారతదేశం నుంచి ఒక గొప్ప నటుడిని ఎంపిక చేయండి అని అడిగితే ఎవరిని ఎంపిక చేస్తారని ప్రశ్నించారు.
దీనికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాసన్ సంజయ్ స్పందిస్తూ, నా తొలి ఎంపిక మా నాన్న విజయ్ గారే. ఆయనతో కలిసి జాసన్ స్టాథమ్ స్క్రీన్‌పై కనిపిస్తే అది అద్భుతమైన కాంబినేషన్ అవుతుంది. నేను చెప్పిన ఈ మాటలు జాసన్ స్టాథమ్ వరకు చేరాలని కూడా కోరుకుంటున్నాను అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చారు. ఇక జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగ్మా’ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా దర్శకుడిగా జాసన్ ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అటు తండ్రి విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో, కుమారుడు జాసన్ సంజయ్ సినీ రంగంలో దర్శకుడిగా అడుగుపెడుతుండటం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.