కూసుమంచి, మార్చి 14 : రైతుల సాగునీటి అవసరాల కోసం పాలేరు రిజర్వాయర్ పరిధిలోని పాలేరు పాత కాలువ(చానల్)కు శనివారం 200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ రెండో జోన్, మూడో జోన్ల కింద రైతులకు నీరు ఎక్కువగా అవసరం పడటంతో ఇన్ ఫ్లో కంటే అవుట్ ఫ్లో వెయ్యి క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గత ఆదివారం నీటిని నిలిపివేయగా..
తిరిగి శనివారం కూసుమంచి, నేలకొండపల్లి రైతుల అవసరాల కోసం నీటిని వదిలారు. పాత కాలువ కింద రెండు మండలాల్లో ప్రస్తుత యాసంగిలో సుమారు 10 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో చెరకు పంటను రైతులు సాగు చేస్తున్నారు. పాలేరు జలాశయం నీటిమట్టం శనివారం నాటికి 18.85 అడుగులు ఉండగా.. పాలేరుకు ఇన్ ఫ్లో ద్వారా సాగర్ డ్యాం నుంచి 3,866 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
అయితే పాలేరు నుంచి దిగువకు మిషన్ భగీరథకు 135 క్యూసెక్కులు, భక్తరామదాసు ఎత్తిపోతలకు నీటిని నిలిపివేశారు. రెండో జోన్కు మాత్రం 4,668 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో మధ్య వెయ్యి క్యూసెక్కుల వ్యత్యాసం ఉండటంతో పాలేరు నీటిమట్టం రోజుకు 0.50 అడుగుల మేర తగ్గుతోంది. వేసవి కాలం సమీపిస్తుండటం, దిగువ ఆయకట్టు రైతులకు నీటి అవసరాలు ఎక్కువ కావడంతో పాలేరు నుంచి కల్లూరు వరకు రెండో జోన్కు, కల్లూరు నుంచి నూజివీడు వరకు మూడో జోన్కు అధికారులు నీటిని వదులుతున్నారు.