సిటీ బ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో లక్ష ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రీలాంచ్ను తలపించేలా ఇందిరమ్మ ఇండ్ల పథకం తీరు ఉన్నది. నగరంలోని పేదలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలని, అందుకోసం ముందుగా రూ.100 చెల్లించాలని బ్రోచర్లో పేర్కొన్నారు. అదేవిధంగా టోకెన్ అమౌంట్ కింద రూ.10 వేలు చెల్లించాలని.. ఇల్లు మంజూరు కానీ దరఖాస్తుదారులకు ఆ మొత్తాన్ని తిరిగిస్తామని విధి విధానాల్లో చూపారు. కానీ ఆ రూ.10 వేలు కూడా నొక్కేసే పరిస్థితులు క్షేత్రస్థాయిలో నెలకొన్నాయి. దరఖాస్తు ఫారంలో దరఖాస్తుదారుడి అకౌంట్ నంబర్ నమోదు చేసేలా ఆప్షన్ లేకపోవడంతో కంగుతింటున్నారు.
ఒకవేళ ఇల్లు రాకపోతే ముందుగానే చెల్లించిన టోకెన్ అమౌంట్ తిరిగి ఎలా చెల్లిస్తారు? రూ.10 వేల టోకెన్ అమౌంట్ ఇల్లు మంజూరు కాని వాళ్లకు తిరిగి ఇవ్వరా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరు రూ.6 లక్షలు చెల్లించాలనే నిబంధన పెట్టడంతో పేదల సొంతింటి కలపై నీళ్లు చల్లినట్లయింది. బస్తీలు, గుడిసెల్లో నివసించే నిరుపేదలకు రూ.6 లక్షలు చెల్లించే స్థోమత ఎలా ఉంటుంది? అని నగరంలోని పేదలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. పేదలకు ఇచ్చే ఇండ్లతో వ్యాపారం చేయడం సరికాదంటున్నారు.