సోమవారం 25 జనవరి 2021
National - Dec 27, 2020 , 01:23:52

అసోంలో కొత్త భక్తి ఉద్యమం

అసోంలో కొత్త భక్తి ఉద్యమం

  • యువత హింసను వీడటంలో వైష్ణవ మఠాలది కీలకపాత్ర
  • అసోం పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

గువాహటి: అసోం యువతను శాంతి, అభివృద్ధి మార్గంలో నడిపించడంలో రాష్ట్రంలోని నామ్‌ఘర్‌లు (వైష్ణవ మఠాలు) కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. వీటి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్త భక్తి ఉద్యమం మొదలైందని, గతంలో ఆయుధాలు చేతబట్టిన యువతను తిరిగి జనజీవన స్రవంతిలో కలపడానికి ఇది ఎంతో దోహదపడుతున్నదని చెప్పారు. అసోంలో ఉన్న 8 వేల వైష్ణవ మఠాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 2.5 లక్షల చొప్పున సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. అసోంలో 15వ శతాబ్దపు సాంస్కృతిక, మతగురువు శ్రీమంత శంకరదేవ జన్మస్థలమైన బతద్రవ వైష్ణవ మఠం సుందరీకరణ పనులను ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా షా అసోం వచ్చారు. గువాహటిలో రూ. 755 కోట్లతో నిర్మించతలపెట్టిన మెడికల్‌ కాలేజీకి, 9 న్యాయ కళాశాలలకు, మరో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అసోంను వేర్పాటువాదులు పాలిస్తున్న సమయంలో వారు రాష్ట్ర యువత చేతికి తుపాకులు ఇచ్చారని ఆరోపించారు. సీఎం సర్బానంద సోనోవాల్‌-హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించారని, ఇప్పుడు అసోం యువత దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. అసోంలో శాంతి స్థాపనలో బోడోలాండ్‌ ఒప్పందం అతిపెద్ద విజయమని చెప్పుకొచ్చారు. బోడోలాండ్‌ ఎన్నికల్లో ఎలాంటి హింస జరగకపోవడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. 


logo