ముంబై: రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రమాదాలకు గురై ఇద్దరు యువకులు మరణించారు. ఈ నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలకు దండలు వేసి నిరసన తెలిపారు. (Protesters Garland Potholes) బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. పాల్గడ్కు చెందిన 19 ఏళ్ల హేమంత్ కుమార్ వాడా-భివాండి హైవేపై స్కూటర్‌పై వెళ్తున్నాడు. రోడ్డుపై గుంతల వల్ల ట్రాలీని ఢీకొట్టి జారి రోడ్డుపై పడ్డాడు. వసూరిలోని బ్లూ స్టార్ కంపెనీలో పని తర్వాత ఇంటికి తిరిగి వెళ్తూ ఈ ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబానికి ఏకైక జీవనాధారమైన అతడు అక్కడికక్కడే మరణించాడు.
Teens Die In Accident
కాగా, నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల మహేంద్ర ఫాటింగ్ బైక్‌పై వెళ్తూ రోడ్డు మధ్యలో ఉన్న నీటి గుంతలో జారిపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మాజీ కౌన్సిలర్ సరితా ఈశ్వర్ కవారే మేనల్లుడైన మహేంద్ర మరణంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు మహారాష్ట్రలోని రోడ్లు గుంతలమయంగా మారడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని, తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. రోడ్లపై నీటితో నిండిన గుంతలకు పూల దండలు వేసి నిరసన తెలిపారు. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సులే కూడా గుంతలమయంగా ఉన్న రోడ్ల వీడియోలను షేర్ చేశారు. నాసిరకంగా రోడ్లను నిర్మించారని ఆమె ఆరోపించారు.
Also Read:
brain-eating amoeba | కేరళలో 67కు చేరిన మెదడు తినే అమీబా కేసులు.. 18 మరణాలు నమోదు
Watch: ఎలుగుబంటికి కూల్ డ్రింక్ ఇచ్చిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?