జైపూర్: ఒక మహిళ 600 కిలోమీటర్లు కారు డ్రైవ్ చేసి తన ప్రియుడ్ని కలిసింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో అతడు ఆమెను హత్య చేశాడు. (Lover Kills Woman) కారు డ్రైవింగ్ సీటులో మృతదేహాన్ని ఉంచి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఝుంఝునులో అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేస్తున్న 37 ఏళ్ల ముఖేష్ కుమారి పదేళ్ల కిందట భర్త నుంచి విడిపోయింది. గత ఏడాది అక్టోబర్‌లో బార్మర్‌లో స్కూల్ టీచర్ అయిన మనారామ్‌తో ఫేస్బుక్లో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ తరచుగా మాట్లాడుకోవడంతోపాటు కలుసుకున్నారు.
కాగా, ముఖేష్ కుమారి, మనారామ్ మధ్య రిలేషన్షిప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమె తన కారులో 600 కిలోమీటర్లు ప్రయాణించి అప్పుడప్పుడు ప్రియుడ్ని కలిసేది. పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడదామని అతడ్ని ఒత్తిడి చేసేది. అయితే మనారామ్, అతడి భార్యతో విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నది. దీంతో పెళ్లి అంశంపై కుమారి, అతడి మధ్య గొడవ జరిగేది.
మరోవైపు సెప్టెంబర్ 10న ముఖేష్ కుమారి తన ఆల్టో కారును 600 కిలోమీటర్లు డ్రైవ్ చేసి ఝుంఝును నుంచి బార్మర్ చేరుకున్నది. మనారామ్ సొంత గ్రామానికి వెళ్లింది. స్థానికులను అడిగి అతడి ఇంటికి చేరుకున్నది. తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి ప్రియుడి కుటుంబ సభ్యులకు చెప్పింది.
కాగా, మనారామ్ దీనిపై ఆగ్రహించాడు. కుమారితో గొడవపడ్డాడు. దీంతో స్థానిక పోలీసులు వారిద్దరిని స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని వారికి సూచించారు. ఆ రోజు సాయంత్రం కుమారి, మనారామ్ కలుసుకుని మాట్లాడుకున్నారు.
ఈ సందర్భంగా పెళ్లికి ఒత్తిడి చేసిన ఆమె తలపై ఐరన్ రాడ్‌తో కొట్టాడు. దీంతో కుమారి మరణించింది. ఆమె కారులోని డ్రైవింగ్ సీటులో మృతదేహాన్ని ఉంచాడు. రాళ్లగుట్టలోకి కారును తోశాడు. ప్రమాదంలో ఆమె చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత తన ఇంటికి చేరుకుని నిద్రపోయాడు.
Accident
ఆ మరునాడు కారులో కుమారి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తన లాయర్‌కు మనారామ్ చెప్పాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ కారు వద్దకు చేరుకున్నారు. ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. కుమారి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు ముఖేష్ కుమారి మరణించిన సమయంలో ఆమె, మనారామ్ ఫోన్ లొకేషన్లు ఒకేచోట ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రియురాలిని తానే చంపినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
man shot wife dead | మరో వ్యక్తి బర్త్ డే పార్టీలో భార్య.. వీడియో చూసి కాల్చి చంపిన భర్త
Baby Girl Buried Alive | 15 రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టారు.. రక్షించిన పోలీసులు
Air Force Engineer Suicide | 24వ అంతస్తు పైనుంచి దూకి.. ఎయిర్ ఫోర్స్ ఇంజినీర్ ఆత్మహత్య
brain-eating amoeba | కేరళలో 67కు చేరిన మెదడు తినే అమీబా కేసులు.. 18 మరణాలు నమోదు