నీలగిరి, ఫిబ్రవరి 28 : నల్లగొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దేందుకు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పని చేద్దామని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ కార్పొరేషన్ తొలి సమావేశం మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణాన్ని రాబోయే కాలంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు అంతా కలిసి కట్టుగా పని చేయాలని ఈ మేరకు కార్పొరేటర్లంతా సహకరించాలని కోరారు. ఏ చిన్న సమస్య వచ్చినా రాజకీయాలు పక్కన పెట్టి తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహకారంతో మరిన్ని నిధులు మంజూరు చేయించుకుని అభివృద్ధికి బాటలు వేద్దామన్నారు.
పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్ల విషయంలో ఎప్పటికప్పుడు కార్పొరేటర్లు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. అదేవిధంగా నల్లగొండ పట్టణంలో ప్రజలందరికీ 24 గంటల పాటు తాగునీరు అందించే విధంగా ప్రణాళికల రూపొందించడం జరిగిందని, వచ్చే ఏడాది నాటికి 24 గంటల పాటు కృష్ణా జలాలు అందిస్తామని ఆమె తెలిపారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే ఐదు సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, అందులో ఒకటి పూర్తయిందని మిగతా వాటిని కూడా త్వరలో పూర్తిచేసి వేసవిలో కరెంట్ సమస్య లేకుండా పని చేస్తామని తెలిపారు. ప్రకాశం బజార్లో చాలా సమస్యలు వస్తున్నాయని అందుకే అక్కడ ఉన్న వీధి వ్యాపారులను మరోచోట ప్రత్యామ్నాయంగా దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ వారందరికీ కనీస సౌకర్యాలు అందించేలా కృషి చేస్తానని తెలిపారు.
పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ వీధుల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందని, వీధిలైట్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దోమల ఉధృతి అధికంగా ఉందని మేయర్ దృష్టికి తీసుకురాగా వాటన్నిటిని పరిశీలించి పరిష్కారస్తానని హామీ ఇచ్చారు. పదో డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు సాధ్యమైనంత వేగంగా నాణ్యతగా పూర్తి చేయాలని సభ్యులు కోరారు. ఈ సమావేశంలో కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర, డిప్యూటీ మేయర్ అమేర్, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, మందడి లిఖిత సైదిరెడ్డి, రేగట్టే అండాలు లింగస్వామి, దాసరి సాయి, రామగిరి అఖిల్, బాగవతు డిప్లా నాయక్, పేర్ల మల్లేశ్వరి, దొడ్డి రమేష్, రత్నపురం తారకమ్మ, గోపగాని స్వాతి, పెరిక యాదయ్య, ఇటుకల మంగమ్మ, ఇబ్రహీం, కేసాని వేణుగోపాల్ రెడ్డి, అబ్బగోని కవిత, బోయినపల్లి వేదశ్రీ, యామ కవితరాణి పాల్గొన్నారు.

నల్లగొండను స్మార్ట్ సిటీగా రూపుదిద్దుదాం : మేయర్ బుర్రి చైతన్య