Military Training | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కేసు దర్యాప్తులో మరో కీలక విషయం వెల్లడైంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ (Pakistan)లో మిలిటరీ శిక్షణ (Military Training) పొందినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి ఈ శిక్షణ పొందినట్లు సదరు వర్గాలు తెలిపాయి.
గత నెల 22న బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిని జమ్ము జైళ్లకు తరలించారు. ఇక ఈ కేసుపై ఎన్ఐఏ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా జైల్లో ఉన్న కొందరు అనుమానిత ఉగ్రవాదులను, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్‌ను ప్రశ్నించగా.. ఈ విషయం వెల్లడైంది.
పెహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరైన హషీమ్ మూసా గతంలో పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో పారా కమాండోగా పనిచేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. తర్వాత అతను లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో చేరినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి అనేక ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. మూసా 2023లో భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది. అప్పటి నుంచి జమ్ము కశ్మీర్ ప్రాంతంలో అనేక ఉగ్రదాడుల్లో పాలుపంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది అక్టోబర్‌లో గందర్బల్ జిల్లాలో జరిగిన దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ దాడి సహా మొత్తం ఆరు ఉగ్రదాడుల్లో అతడు పాల్గొన్నట్లు సమాచారం. మూసా ప్రస్తుతం దక్షిణ కశ్మీర్‌లోని అడవుల్లో రహస్య ప్రాంతంలో దాక్కున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అతడి కోసం ఆపరేషన్ మొదలుపెట్టారు.
Also Read..
PM Modi | పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ
Chenab River | పాక్‌కు చీనాబ్ నీళ్లు బంద్.. సలాల్ జలాశయం గేట్లు మూసివేత.. VIDEOS
Jammu jails | ఉగ్రవాదులను విడిపించుకునేందుకు జమ్ము జైళ్లపై దాడులకు కుట్ర.. హై అలర్ట్