Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ క్షమాపణలు చెప్పాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర ప్రమోషన్స్ సమయంలో జరిగిన ఒక చిన్న పొరపాటు ఈ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఎక్స్ వేదికగా ఈ సినిమా మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టాలనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ చేశారు. దీనికి హరీష్ శంకర్ రిప్లై ఇవ్వడంతో మహేష్ బాబు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ని ట్రోల్ చేయడం ప్రారంభించారు.
ఈ వివాదం ముదరడంతో హరీష్ శంకర్ వెంటనే స్పందిస్తూ వివరణ ఇచ్చారు. షూటింగ్ పనుల్లో మరియు సెన్సార్ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ ట్వీట్‌ను పూర్తిగా చదవకుండానే, కేవలం అభిమాని ఉత్సాహాన్ని చూసి పొరపాటున స్పందించానని ఆయన పేర్కొన్నారు. తనకు మహేష్ బాబు అంటే ఎంతో గౌరవమని, గతంలో ఆయన నటించిన ‘పోకిరి’ సినిమా గురించి కూడా తాను ఎంతో పాజిటివ్‌గా మాట్లాడానని గుర్తుచేశారు. అంతేకాకుండా, రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా పెద్ద రికార్డులు సృష్టించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. తన రిప్లై వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణలు కోరుతున్నానని హరీష్ శంకర్ ప్రకటించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో తాను కావాలని ఇలాంటి వివాదాలు చేసే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు.