Bandi Sanjay | కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేయడం దారుణమని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు.
కన్నతల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో.. శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత కంటే పాపమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. శాసన వ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసినప్పటికీ అనర్హత వేటు వర్తించకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసినా పార్టీ ఫిరాయించలేదని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
గాంధీభవన్‌లో సంసారం చేస్తూ.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నా ఫిరాయింపులు వర్తించకపోవడం ప్రజాస్వామ్యానికే చేటు అని బండి సంజయ్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించింది నిజం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
శాసన వ్యవస్థపై ప్రజలకు పూర్తిగా నమ్మకం కోల్పోయేలా స్పీకర్ తీర్పు ఇచ్చారని బండి సంజయ్ అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కాంగ్రెస్ ఆఫీసులో బంధించాలని చూస్తున్నారని ఆరోపించారు. శాసనసభ స్పీకర్… స్వతంత్ర్యంగా వ్యవహరించాలే తప్ప డూప్లికేట్ గాంధీ కుటుంబానికి తాబేదారులా వ్యవహరించకూడనది సూచించారు. ప్రజాస్వామ్యవాదులారా నోరు విప్పండి అని పిలుపునిచ్చారు. పూర్తిగా గాడి తప్పిన శాసన వ్యవస్థను దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రజలదే అని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేమని బండి సంజయ్ స్పష్టం చేశారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని తెలిపారు. బెంగాల్లో అనర్హత పిటిషన్ పై స్పీకర్ ఇదే తరహా తీర్పు ఇస్తే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో కొట్టేసిందని గుర్తుచేశారు. తెలంగాణలోనూ ఫిరాయింపులపై చెంప చెళ్లుమనేలా న్యాయ వ్యవస్థ తీర్పు ఇస్తుందనే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.