Chenab River | పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పొరుగుదేశం పాకిస్థాన్‌ను భారత్ అన్ని విధాల నుంచి దిగ్బంధనం చేస్తోంది. ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ జలాల నుంచి పాక్‌కు చుక్క నీరు కూడా వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే తాజాగా చీనాబ్ నీటిని (Chenab River) పాక్‌కు వెళ్లకుండా భారత్ చర్యలు తీసుకుంది. ఆ నదిపై నిర్మించిన సలాల్ జలాశయం (Salal Dam) గేట్లను అధికారులు మూసివేశారు. జమ్ము కశ్మీర్‌లోని రియాసి (Reasi) జిల్లాలో ఉన్న ఈ డ్యామ్ గేట్లను అధికారులు మూసివేయడంతో చుక్క నీరు పారక నదీ ప్రవాహక ప్రాంతం వెలవెలబోతోంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#WATCH | Jammu and Kashmir: The Chenab River witnessed a significant drop in water levels in the Reasi district after the closure of gates at the Salal Dam. pic.twitter.com/FITFjKxc8F
— ANI (@ANI) May 5, 2025
ఇప్పటికే బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్‌కు నీటి సరఫరాను భారత్ ఆపేసిన విషయం తెలిసిందే. బాగ్లిహార్ డ్యామ్ నుంచి నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఆ డ్యామ్ స్లూయిస్ స్పిల్‌వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. దాంతో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు అక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. అయితే ఇది స్వల్పకాల చర్యగా అధికారులు తెలిపారు. అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాకిస్థాన్‌కు తెలియజేసేందుకు తాత్కాలికంగా నీటి సరఫరాను నిలిపేసినట్లు చెప్పారు.
గత నెల 22న మధ్యాహ్నం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పెహల్గామ్ (Pahalgam)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో కశ్మీర్లోయతోపాటు దేశంమొత్తం భగ్గుమంది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌పై కఠిన చర్యలకు దిగింది. సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty ) నిలిపివేసింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జలాల నుంచి పాక్‌కు చుక్కనీరు కూడా వదిలేది లేదని వెల్లడించింది. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా చర్యలు చేపట్టింది.
#WATCH | Jammu and Kashmir: Latest visuals from Reasi, where all gates of Salal Dam on Chenab River are closed. pic.twitter.com/rqaimJ0mq6
— ANI (@ANI) May 5, 2025
సింధు జలాల ఒప్పందం ప్రకారం.. సింధు నది లోయలోని నదులను తూర్పు, పశ్చిమ నదులుగా విభజించారు. తూర్పు ప్రాంతంలోని రవి, బియాస్, సట్లెజ్ నదులు భారతదేశానికి.. సింధు, చీనాబ్, జీలం నదులను పాకిస్థాన్‌కు ఇచ్చారు. పాకిస్థాన్‌లోని నదుల నీటిని విద్యుత్, నీటిపారుదలకు పరిమితంగా ఉపయోగించుకునే హక్కు కూడా భారతదేశానికి ఉన్నది. అయితే, పెహల్గామ్ ఉగ్రదాడితో ఆ దేశానికి వెళ్తున్న నీటిని భారత్ ఆపేసే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే చీనాబ్ నీళ్లు పాక్‌కు వెళ్లకుండా బంద్ పెట్టింది.
Also Read..
Jammu jails | ఉగ్రవాదులను విడిపించుకునేందుకు జమ్ము జైళ్లపై దాడులకు కుట్ర.. హై అలర్ట్
Tangmarg | ఉగ్రవాదులకు సాయం చేసి.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకి వ్యక్తి మృతి
Fire Accident | కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం