అక్రమాలు, ఆక్రమణలు, అరాచకాలకు కాంగ్రెస్ సర్కారు నిదర్శనంగా నిలుస్తున్నది. రెండున్నరేండ్ల నుంచి ప్రజలను వేధింపులకు గురిచేస్తూ అరాచక పాలన సాగిస్తున్నది. భూములను చెరబట్టి, ప్రజలను రోడ్డు పాలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల్లో ఖరీదైన భూములపై రేవంత్‌రెడ్డి కన్ను పడితే చాలు.. లాక్కోవడమే పరమావధిగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే పరిహారంగా ఇచ్చిన భూములను అదే కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నది.
ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములను ఇచ్చిన రైతులకు అప్పట్లో పరిహారంగా ఇచ్చిన ప్లాట్లలోనూ తాజాగా మూసీ ప్రాజెక్టు కోసం సర్వే చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వాసితులకు గండిపేట మండలం కిస్మత్పూర్ పరిధిలోని సర్వే నంబర్ 117లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాట్లను పంపిణీ చేసింది. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట అదే సర్వే నంబర్లో సోమవారం అధికారులు సర్వే చేపట్టారు. అప్పటి కాంగ్రెస్ సర్కారు భూములు కోల్పోయిన రైతులకు పరిహారంగా ప్లాట్లను ఇస్తే.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి మళ్లీ ప్రభుత్వమే తీసుకుంటుందని అధికారులు సైతం బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో ప్లాట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ)
ఔటర్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన 40 మంది రైతులకు కిస్మత్పూర్ పరిధిలోని సర్వేనంబర్ 117లో 250 గజాల చొప్పున ప్లాట్లు పంపిణీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు 2008లో అందుబాటులోకి రాగా, అప్పటి కాంగ్రె స్ ప్రభుత్వం పరిహారం కింది ప్లాట్లను ఇచ్చారు. ఇప్పుడు మూసీ సుందరీకరణలో భాగంగా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్లాట్లను స్వాధీనం చేసుకునేందుకు సర్వే చేపట్టింది. సర్వేను అడ్డకునేందుకు వెళ్లిన ప్లాట్ల యజమానులతో అధికారులు వాగ్వాదానికి దిగారు. అప్పుడు ప్రభుత్వమే ఇచ్చింది.. ఇప్పుడు అదే ప్రభుత్వం ప్లాట్లను తీసుకుంటున్నది.. ఎందుకు అడ్డుకుంటున్నారు.. వీటికి బదు లు మరోచోట ఇస్తారంటూ అధికారులు సమాధానమిచ్చినట్లు బాధితులు వాపోతున్నారు.
అప్పటి ప్రభుత్వం తమకు ఉచితంగా ఏమీ ఇవ్వలేదని.. తమ భూములను తీసుకుని అందుకు పరిహారంగా ఇచ్చిందని ప్లాట్ల యజమానులు చెబుతున్నారు. మూసీ నదికి దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న తమ ప్లాట్లను తీసుకుని ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకే తమ భూములను లాక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు. మూసీ పేరు చెప్పుకొని ప్రజలను రోడ్డున పడేయటమే ప్రజాపాలనా? అంటూ నిలదీస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్లాట్లను వదులుకోబోమని తేల్చి చెబుతున్నారు.
మూసీ పేరిట రోజుకో చోట అలజడి
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో చోట అలజడి సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఎక్కడ ఖరీదైన భూమి కనిపించినా దాన్ని మూసీ నది అభివృద్ధికి ఆపాదించి సర్వేలు చేస్తూ యజమానులను మానసికంగా వేధిస్తున్నారు. మూసీ నదికి కిలోమీటర్ దూరంగా ఉన్న భూములను కూడా వదలడం లేదు. ఇప్పటిదాకా హైదర్‌గూడలోని 28ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని గ్రామసభ పెట్టి వేధింపులకు గురిచేశారు.
సర్వే పేరుతో అలజడి..
తాజాగా కిస్మత్పూర్, హిమాయత్‌సాగర్‌లో అధికారులు సర్వే చేసి అలజడి సృష్టించారు. కిస్మత్పూర్లో ఓఆర్ఆర్లో భూములు కోల్పోయిన వారికిచ్చిన ప్లాట్లను సర్వే చేసి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. వారికి 15 రోజులు సమయం ఇస్తున్నట్లు ఈలోగా ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని అధికారులు ఆదేశించారు. పరిహారం కింద నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే భూములను ఇచ్చి.. అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ లాక్కుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకిచ్చిన భూములకు మూసీతో సంబంధం లేకున్నా కాంగ్రెస్ పెద్దల స్వప్రయోజనాల కోసం లాక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండి పడుతున్నారు.