నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 23 : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కుటుంబంపై దాడి జరుపగా రెండు నెలల శిశువు చనిపోయి మూడ్రోజులవుతున్నా అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు న్యాయం చేయలేకపోయారు. దాడిచేసిన ఎనిమిది మందిపై హత్య కేసు నమోదుచేయకుండా పోలీసులు చేతులెత్తేయడంతో బీఆర్ఎస్తోపాటు దళిత బహుజన, బీసీ, ప్రజా సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేయగా సోమవారం అఖిలపక్షంతోపాటు సీపీఎం, బీఎస్పీ, బహుజన ప్రజా సంఘాలు, రజక కుల సంఘాల రాష్ట్ర ప్రతినిధులు సందర్శించి మద్దతు తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, అధికారంలో ఉన్న రెడ్లయిన స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రాజేశ్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిపై మండిపడ్డారు.
అగ్రకుల పెత్తందారుడైన మధుసూదన్‌రెడ్డి కాలుతో పసికందును తన్నడంతో ఇంటర్నల్‌గా గాయాలై చికిత్స పొందుతూ మరణించిందనేది బహిరంగ రహస్యమని ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. దాడికి కారకులంతా సీఎం బంధువులు అయినందుకే వారిపై కేసులు పెట్టడం లేదని ఆరోపించారు. కుమ్మెర సర్పంచ్ తుకారాంరెడ్డి ఎమ్మెల్సీ బావమరిది కావడం వల్లే వెనుకేసుకొస్తున్నారని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మర్రి.. సదరు కుటుంబానికి ఆర్థికసాయంతోపాటు ఇంటి నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు, దాడి చేసిన వారిని అరెస్టు చేసే వరకు ఆందోళనలు ఉధృతమయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే శిశువు మృతికి సంతాపం తెలుపుతూ ఉమ్మడి జిల్లాలో నిరసనలు కొనసాగాయి. బిజినేపల్లి, చారకొండ, తిమ్మాజిపేట మండల కేంద్రాల్లో బీఆర్ఎస్, రజక, బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.
కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణానికి కారకుడైన తుకారాంరెడ్డిని సర్పంచ్ పదవి నుంచి తప్పించాలి. చంటిపాప ఉందని, బాలింత అని కూడా చూడకుండా ఫుట్‌బాల్‌ను తన్నినట్టుగా రెండు నెలల శిశువు మరణానికి కారకులైన రెడ్లపై వెంటనే హత్య కేసు నమోదు చేయాలి. బీసీలకు అన్యాయం జరిగితే రెడ్లను వెనుకేసుకు రావడం చూస్తే ఇక్కడి రెడ్లయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మనపై ఎంత ప్రేమ ఉన్నదో తెలుస్తున్నది. ఇంతటి దారుణం జరిగినా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడంలేదో అర్థం కావడం లేదు. పసిబిడ్డ చనిపోయిన విషయమై సీఐ అశోక్‌రెడ్డితో మాట్లాడితే నిర్లక్ష్య ధోరణి అవలంబించారు. ఎస్పీ లేదా డీఎస్పీ ఈ కేసు విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. ఈ ఘటనపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. సర్పంచ్ పక్కన ఉండి కూడా దాడి చేసిన వారిని ఏమన లేదంటే.. దగ్గర ఉండి మరీ దాడి చేయించినట్టు భావించాల్సి వస్తున్నది. అతడిని సర్పంచ్ పదవి నుంచి తొలగించాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మా రజకులు ఆందోళనలు ఉధృతం చేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలో రజక సంఘాల ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిస్తామని తెలిపారు.
కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణానికి కారకులైన ఎనిమిది మంది రెడ్లను అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. బాధిత కుటుంబంపై మొదటగా దాడికి పాల్పడిన శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని ముట్టడించి 24 గంటలు గడుస్తున్నా పోలీసుల్లో చలనం లేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అండతో పోలీసులు కేసు పెట్టే విషయంలో తాత్సారం చేస్తున్నారు.ఇంత జరుగుతున్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దారుణం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు సబ్బండ కులాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తాం. చంద్రకళ, గణేశ్, మౌనికకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. పసికందు మరణ విషయంలో పోలీసులు ఇప్పటికీ మర్డర్ కేసు కాకుండా హత్యాయత్నం కేసు నమోదు చేయడం సరికాదు. రెడ్డి కులానికి చెందిన సీఐకి ఫిర్యాదు చేస్తే దాడిచేసిన రెడ్లపై కేసు బనాయించేందుకు ఇష్టం లేక సెలవులో వెళ్లిపోయాడు. ఎస్సై, డీఎస్పీని ముందుకు తోస్తూ సీఐ రెడ్లకు వంత పాడుతున్నాడు. సీఎం సొంత జిల్లాలో ఇంతటి అమానవీయ ఘటన జరిగినా ఓ వైపు అధికారికంగా రాజేశ్‌రెడ్డి.. పోలీసుల తరఫున సీఐ అశోక్‌రెడ్డి మర్డర్ కేసు పెట్టకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తున్నది. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపే వరకు ఆందోళన విరమించబోం.