NTR | ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి తెరపైకి రానుంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్గా కాకుండా భారీ స్థాయిలో రూపొందనున్న పౌరాణిక యాక్షన్ ఎపిక్‌గా ఉంటుందని సమాచారం. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పురాణ కథలు, ఇతిహాస అంశాలను ఆధారంగా చేసుకుని కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు టాక్. పాత్రలో వీరత్వంతో పాటు ఆధ్యాత్మికత, భావోద్వేగం, యాక్షన్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తనదైన కథనం, బలమైన సంభాషణలతో ఈ కథను తెరకెక్కించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. ఎన్టీఆర్ పోషించనున్న యోధుడి పాత్రకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. పౌరాణిక నేపథ్యానికి భారీ యాక్షన్‌ను జోడిస్తే ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత గ్రాండ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను 2027 మార్చి తర్వాత ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఏడాది ద్వితీయార్ధంలో షూటింగ్‌ను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. భారీ సెట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉన్నందున ప్రీ-ప్రొడక్షన్ దశలోనే సినిమాకు సంబంధించిన కీలక అంశాలను పక్కాగా సిద్ధం చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన భుజానికి అయిన గాయం నుంచి కోలుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్న ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత తన తదుపరి చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ‘డ్రాగన్’ చిత్రీకరణ పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నాడని సమాచారం. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా దశలవారీగా ముందుకు సాగనున్నాయి.