టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం నేతగా మొజ్తాబా ఖమేనీ(Mojtaba Khamenei) ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడిలో మొజ్తాబా తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందారు. ఆ దాడిలోనే మొజ్తాబాకు గాయాలైనట్లు కొన్ని నివేదికలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ కుమారుడు స్పందించారు. మొజ్తాబా ఖమేనీ సురక్షితంగా, బలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మొజ్తాబా గాయపడినట్లు వార్తలు వచ్చాయని, అయితే అతనితో లింకున్న కొందరు మిత్రులను ఈ విషయాన్ని అడిగి తెలుసుకున్నానని, మొజ్తాబా క్షేమంగా ఉన్నట్లు వారు చెప్పారని అధ్యక్షుడి కుమారుడు యూసెఫ్ పెజెస్కియాన్ తెలిపారు.
ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న యూసుఫ్ పెజెస్కియాన్ ఈ విషయాన్ని టెలిగ్రాం ఛానల్ ద్వారా వెల్లడించారు. ఖమేనీ మృతిచెందిన రోజే ఆ దాడుల్లో మొజ్తాబా కాళ్లకు గాయాలు అయినట్లు అమెరికాకుచెందిన న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నది. అయితే 56 ఏళ్ల మొజ్తాబా ఆదివారం కీలక ప్రకటన చేశారు. అలీ ఖమేనీకి వారసుడిని అని ప్రకటించారు. కాళ్లకు గాయాలు కావడం వల్లే మొజ్తాబా వీడియో సందేశాలు ఇవ్వడం లేదని అమెరికా పత్రిక తన కథనంలో పేర్కొన్నది.