Mouli | ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో విజయాన్ని అందుకున్న యువ నటుడు మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘దొంగ నా కొడకా’ అనే వినూత్నమైన టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని క్రైమ్ కామెడీ జానర్లో తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు థ్రిల్లింగ్ అంశాలను కలగలిపిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు శ్రీను కంబాల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. కథలో వచ్చే ట్విస్టులు, కామెడీ ట్రాక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కళాశాలలో ఘనంగా ఆవిష్కరించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. యువతను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ప్రకటించకముందే సినిమా గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతుండగా, ఇప్పుడు ‘దొంగ నా కొడకా’ అనే టైటిల్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రంలో సుష్మితా షెన్ కథానాయికగా నటిస్తోంది. హీరో-హీరోయిన్ల మధ్య వచ్చే వినోదభరితమైన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. సినిమాటోగ్రాఫర్ సూర్య బాలాజీ తన కెమెరాతో చిత్రానికి ప్రత్యేక విజువల్ టోన్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథకు తగ్గట్టుగా నాణ్యమైన నిర్మాణ విలువలు, వినోదాత్మక స్క్రీన్‌ప్లే, విభిన్నమైన పాత్రలు సినిమాపై మంచి అంచనాలు పెంచుతున్నాయి. త్వరలోనే టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలతో పాటు సినిమా విడుదల తేదీ, టీజర్, ట్రైలర్ వంటి ఇతర వివరాలను కూడా చిత్ర బృందం ప్రకటించనుంది. వినూత్నమైన టైటిల్‌తో వస్తున్న ‘దొంగ నా కొడకా’ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.