రాయ్‌పూర్: జ్వరం బారిన పడిన ఐఐటీ భిలాయ్ విద్యార్థి మరణించాడు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో అతడు మరణించినట్లు స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్‌లో నిరసన తెలిపారు. వైద్య నిర్లక్ష్యంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. (IIT Bhilai Student Death) ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఉన్న ఐఐటీ భిలాయ్‌లో ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల సౌమిల్ సాహు బీటెక్ విద్యార్థి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మొదటి సెమిస్టర్ చదువుతున్నాడు.
కాగా, నవంబర్ 10న సౌమిల్‌కు జ్వరం వచ్చింది. ఆ మరునాడు అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆ విద్యార్థి మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐఐటీ భిలాయ్ యాజమాన్యం తీరు, సకాలంలో వైద్యం అందించని నిర్లక్ష్యం వల్ల సౌమిల్ సాహు మరణించినట్లు అతడి కుటుంబం ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.
మరోవైపు ఐఐటీ భిలాయ్ విద్యార్థులు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు క్యాంపస్‌లో నిరసన తెలిపారు. బుధవారం సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీకి ప్రయత్నించారు. ఐఐటీ భిలాయ్‌లో తగిన వైద్య సౌకర్యాలు లేవని విద్యార్థులు విమర్శించారు.
కాగా, క్యాంపస్ ఆరోగ్య కేంద్రంలో జాప్యం, నిర్వహణ లోపమే సౌమిల్ మరణానికి కారణమని స్టూడెంట్స్ ఆరోపించారు. డాక్టర్, అంబులెన్స్ సమయానికి అందుబాటులో ఉంటే అతడు బతికేవాడని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సౌమిల్ సాహు మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
exit polls | బీహార్‌లో ఎన్డీయేకు స్వల్ప మెజారిటీ.. ఎగ్జిట్ పోల్స్ అంచనా
police vehicle hits Bike | బైక్‌ను ఢీకొట్టిన పోలీస్ వాహనం.. భార్యాభర్తలు, కుమారుడు మృతి
Watch: ఫ్లైఓవర్ పిల్లర్ లోపల నిద్రించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?