Bombay High Court : పదేళ్ల నాటి లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు (Bombay High Court) సంచలన తీర్పు చెప్పింది. ‘ఐ లవ్ యూ (I love you)’ అని చెప్పడం లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు కాదని కోర్టు పేర్కొంది. 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికకు 2015 అక్టోబర్లో ఓ యువకుడు ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. దాంతో తమ కూతురిని ప్రేమ పేరుతో లైంగికంగా వేధించాడని ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసు విచారణ జరిపిన నాగ్పూర్ సెషన్స్ కోర్టు 2017 ఆగస్టులో నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.5000 జరిమానా విధించింది. దాంతో నిందితుడు సెషన్స్ కోర్టు తీర్పును బాంబే హైకోర్టులో సవాల్ చేశాడు. అతని పిటిషన్పై విచారించిన హైకోర్టు యువకుడు నోటితో ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన అది లైంగిక వేధింపు కాదని వ్యాఖ్యానించింది. నిందితుడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలు లేవని పేర్కొంది.
బాలికను అసభ్యంగా తాకడం, ఆమెతో అసభ్యంగా మాట్లాడటం, అసభ్యకరమైన సైగలు చేయడం లాంటివి చేసి ఉంటే.. వాటిని లైంగికవాంఛతో చేసిన చర్యలుగా భావించి లైంగిక వేధింపులుగా పరిగణించవచ్చని, కేవలం ఐ లవ్ యూ చెప్పడాన్ని లైంగిక వేధింపుగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. నాగ్పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసి, నిందితుడికి బెయిల్ ఇచ్చింది.