Deaths | మున్సిపల్ కార్యాలయం ముందున్న చెట్టు కింద కూర్చుని ముగ్గురు ఉద్యోగులు పేపర్ చదువుతుండగా.. ఆ చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని హౌరా మున్సిపల్ కార్యాలయం (Howrah Municipal office) లో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. హౌరా మున్సిపల్ కార్పోరేషన్ చైర్మన్ సుజోయ్ చక్రవర్తి ప్రమాదంపై మాట్లాడుతూ.. మా ఉద్యోగులు ముగ్గురు చెట్టు కింద పేపర్ చదువుతూ కూర్చోగా ఆ చెట్టు కూలిపోయిందని, ఇద్దరు అక్కడికక్కడే మరణించారని, మరో వ్యక్తికి గాయాలయ్యాయని చెప్పారు.
ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని సుజోయ్ చక్రవర్తి అన్నారు. మృతుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని చెప్పారు. వారికి కావాల్సిన ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.