కౌకుంట్ల(చిన్న చింతకుంట), మార్చి 9 : అధికారుల అండతో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది. రాత్రిపగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఊకచెట్టు వాగును తోడేస్తున్నారు. ఈ విషయంపై రైతులు, ప్రజలు నెత్తినోరు కొట్టుకున్నా.. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇసుక మా ఫియా ‘అడిందే ఆట.. పాడింది పాట’గా దందా సాగుతోంది. ప్రభుత్వ కట్టడాలు, ఇందిరమ్మ ఇండ్లు, స్థానిక అవసరాలకు ఇసుక అనుమతులు ఇవ్వడం సమంజసం.
కానీ అందుకు కూడా ప్రభుత్వానికి మైనింగ్ శాఖ చలానా చెల్లించాల్సి ఉం టుంది. అయితే ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఇసుక రవాణా సాగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. ఒక వైపు జిల్లా అధికారులు ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. కానీ మరో వైపు మాత్రం వ్యాపారం ‘మూడు పువ్వులు-ఆరు కాయలు’గా విరాజిల్లుతోంది. అసలు అధికారుల ఆదేశాలు పనిచేయడం లేదా..? లేదా స్థానిక అధికారు లు.. ఉన్నతాధికారుల ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారా? అని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
రోజుకు వందకుపైగా..
చిన్నచింతకుంట మండలం కురుమూర్తిస్వామి ఆలయానికి ఎలివేటెడ్ క్యారిడార్ ఘాట్‌రోడ్ నిర్మాణం పేరుతో రూ.కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఘటన సంచలనం రేపుతోంది. కురుమూర్తి వంతెన సమీపంలోని ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ ఎత్తున ఇసుకను జేసీబీలతో తవ్వి దాదాపుగా 100కుపైగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని, దీంతో కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు పెడ్తున్నారు. ఇసుక రవాణాకు స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తాసీల్దార్ అనుమతులు ఉన్నాయని స్థానికులకు చూపుతున్నారు.
అయితే ప్రభు త్వం కురుమూర్తిస్వామి ఆలయ ఘాట్‌రోడ్ నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేసింది. అందుకు ఎంత మేరకు ఇసుక అవసరం అవుతుంది. అందుకు అవసరమైన చలానా డబ్బులు కూడా చెల్లిస్తుంది. కానీ అభివృద్ధి పనుల పేరుతో అనుమతులు లేకుండా ఇసుకను దోచుకెళ్తున్నారు. మూడ్రోజుల్లోనే దాదాపుగా వెయ్యి ట్రాక్టర్లకుపైగా ఇసుకను తరలించినట్లు సమాచారం. ఇక్కడి తరలించి పలు ప్రాంతాల్లో డంపులు చేసినట్లు తెలిసింది. ఇంత పెద్ద మొత్తంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు మౌనంగా ఎందుకు ఉంటున్నారనిస్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్, ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు. మాఫియాకు సహకరిస్తున్న పోలీస్, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది.
అనుమతులు ఇచ్చేది కొంచెం..
చిన్నచింతకుంట మండల పరిసర గ్రామాల సమీపంలోని ఊకచెట్టు వాగు నుంచి కురుమూర్తి ఆలయం దగ్గర నిర్మాణం చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్ పనుల కోసం ప్రభుత్వ ఆదేశాల మేర కేవలం రోజుకు 25 ట్రిప్పుల ఇసుకను రవాణా చేసేందుకు అనుమతులు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా రోజులు వందల ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలించి డంపులు చేస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నది. ఈ విషయంలో కలెక్టర్ కలుగు జేసుకొని రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలి.
– రాము, కురుమూర్తి గ్రామం, చిన్నచింతకుంట మండలం
నిబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చాం..
కురుమూర్తిస్వామి ఆలయం దగ్గర రూ.110 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణ పనుల కోసం స్థానిక వాగు నుంచి అవసరం మేరకు ఇసుకను తరలించేందుకు పై అధికారుల ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చాం. కొంత మంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అందులో నిజం లేదు. ఒక వేళ ఎవరైనా, ఎక్కడైనా అనుమతులు లేకుండా ఇసుకను తరలించినట్ల తమ దృష్టికి వస్తే అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడం.
– ఎల్లన్న, తాసీల్దార్, చిన్నచింతకుంట మండలం