Rahul Gandhi : పార్లమెంటు (Parliament) కు విద్యార్థులు ర్యాలీ (Students Rally) నిర్వహించిన సందర్భంగా పోలీసులు బలప్రయోగానికి దిగడంపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ ఉదంతంలో పాలకులు అయితే దోషులైనా లేదంటే అసమర్థులైనా అయ్యుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పెల్లెట్ గన్నులు (Pellet Guns), ముళ్లు ఉన్న బ్యాటన్స్, టియర్ గ్యాస్ (Tear Gas) తో విద్యార్థులపై దాడులు జరిగాయని అన్నారు.
శాంతియుతంగా ప్రశ్నలు అడిగిన వారిపై దాడులు జరిగాయని, యువతులను కూడా పోలీసులు కొట్టారని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. పలువురికి ఎముకలు విరిగాయన్నారు. ప్రశ్నలు అడిగిన వారితో మోదీ ప్రభుత్వం అనాగరికంగా వ్యవహరించిందని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు 20 రోజులుగా జరుగుతున్నా హోం మంత్రి సభకు రాలేదని ఆక్షేపించారు. విద్యార్థులపై బలప్రయోగంపై చర్చించేందుకు ప్రతిపక్షం ప్రవేశపెట్టిన ప్రతి తీర్మానం తిరస్కరణకు గురైందని చెప్పారు.
ఈ మౌనం నిర్లక్ష్యమో మరొకటో కాదని, అక్కడ విద్యార్థులపై జరిగిన హింసకు ఆమోదమని రాహుల్‌గాంధీ అన్నారు. వాళ్లు దోషులైనా అయ్యుండాలి లేదా అసమర్థులైనా అయ్యుండాలని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ ఉదంతంపై దర్యాప్తు జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.