న్యూఢిల్లీ: థాయ్‌ల్యాండ్‌లోని పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం(Air India Flight) ఆగస్టు 4వ తేదీన భారీ కుదుపునకు గురైన విషయం తెలిసిందే. గాలిలో కుదుపు వల్ల ఆ విమానంలో ప్రయాణిస్తున్న 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ట్రిపుల్ హైడ్రాలిక్ సిస్టమ్స్ విఫలం కావడం వల్లే.. ఫుకెట్-ఢిల్లీ విమానం ఆల్టిట్యూడ్ సమస్యను ఎదుర్కొన్నట్లు అంచనా వేస్తున్నారు. దీని గురించి ఎయిర్ ఇండియా సంస్థ .. ఎయిర్‌బస్ కంపెనీకి లేఖ రాసింది. తీవ్రమైన సాంకేతిక సమస్య వల్ల ఆల్టిట్యూడ్ సమస్య ఉత్పన్నమైనట్లు భావిస్తున్నారు. కానీ పైలట్లు అప్రమత్తంగా ఉండడం వల్ల భారీ ప్రమాదం తప్పినట్లు అంచనా వేశారు. వాతావరణ పరిస్థితుల వల్ల విమానం కుదుపునకు గురైనట్లు తొలుత భావిస్తున్నా.. తాజా రిపోర్టు ప్రకారం విమాన నిర్మాణంలోనూ లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది.
విమానం సుమారు 300 ఫీట్ల మేర ఆల్టిట్యూడ్ డ్రాప్ అయ్యింది. ఒక్క నిమిషంలోనే తొమ్మిది సార్లు సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ఆటోపైలెట్ డిస్కనెక్ట్ అయ్యింది. హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కూడా జరిగింది. విమాన ముక్కు భాగాన్ని కంట్రోల్ చేసే సిస్టమ్స్ అన్నీ కూడా ప్రభావానికి లోనైట్లు అనుమానిస్తున్నారు. ఆ రోజున పుకెట్ నుంచి విమానం ఉదయం 6.56 నిమిషాలకు బయలుదేరింది. సుమారు 2.5 గంటల పాటు అది జర్నీ చేసింది. ఎయిర్ ఇండియా ఏఐ 2379 విమానం.. సాఫీగా ప్రయాణం చేసింది. కానీ 9.32 నిమిషాల సమయంలో ఒక్కసారిగా కుదుపుకు గురైంది. దీంతో ఎయిర్‌బస్ ఏ320లో ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థం కాలేదు. కుదుపు వల్ల ప్రయాణికులు గాయడపడ్డారు. హైడ్రాలిక్ అండ్ ఫ్లయిట్ కంట్రోల్ సిస్టమ్స్ ప్రభావానికి లోనైట్లు గుర్తించారు.
మూడు సార్లు హైడ్రాలిక్ సిస్టమ్స్ విఫలమయ్యాయని ఎయిర్‌లైన్ పైలట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కెప్టెన్ సామ్ థామస్ తెలిపారు. ఏ320 విమానం రాత్రి 10.30 నిమిషాల సమయంలో ఒడిశాలోని జార్సిగూడ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యిందని, ఆ సమయంలో హైడ్రాలిక్ లోపం తలెత్తినట్లు గుర్తించామన్నారు. ఫ్లయిట్ కంట్రోల్ వ్యవస్థను హైడ్రాలిక్ సిస్టమ్స్ చూసుకుంటాయి. అయితే ఆ సమయంలో ముక్కు భాగాన్ని కిందకు దించాలని కోపైలట్‌కు ఆదేశించినట్లు ఫ్లయిట్ కెప్టెన్ చెప్పాడు. దీంతో విమానం ఒక్కసారిగా 300 ఫీట్ల మేర కిందకు దిగింది. అకస్మాత్తుగా ఆల్టిట్యూడ్ తగ్గడం వల్ల నెగటివ్ జీ ఏర్పడిందని, దాంతో ప్రయాణికులు అటూఇటూ గుద్దుకున్నారని చెప్పారు. కాక్‌పిట్ సిబ్బంది తీసుకున్న నిర్ణయం వల్ల అనేక మంది ప్రాణాలు దక్కినట్లు చెప్పారు. మూడు హైడ్రాలిక్స్ ఒక్కసారి ఫెయిల్ అయినప్పుడు.. విమానాన్ని కనీసం 800 ఫీట్ల కిందకు దించే అవకాశాలు ఉంటాయని కూడా పైలట్ వెల్లడించారు.
ఈ ఘటన పైలట్లను రోస్టర్ నుంచి తప్పించారు. వారికి డోప్ పరీక్షలు కూడా చేయించారు. డోప్ పరీక్షలో ఓ పైలట్ పాజిటివ్‌గా తేలినట్లు తెలిసింది. మరో పైలట్‌కు చెందిన ఫలితం రావాల్సి ఉన్నది.