Sudden deaths | దేశంలో ఇటీవలే ఆకస్మిక మరణాలు (Sudden deaths) ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి యుక్త వయసువారు, వృద్ధులు ఇలా వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. డ్యాన్స్ చేస్తూ, ఆటలు ఆడుతూ ఇలా అప్పటి వరకూ బాగానే ఉన్న వాళ్లు.. ఒక్కసారిగా కళ్లముందే కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. ఎక్కువగా గుండెపోటుతోనే మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్ అనంతరం ఈ మరణాలు అధికమయ్యాయి. దీంతో కొవిడ్ వ్యాక్సిన్ల (Covid vaccines) వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలపై కేంద్రం తాజాగా స్పష్టతనిచ్చింది. ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఆకస్మిక మరణాలకు కొవిడ్ టీకాలే కారణమంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్తంగా లోతైన అధ్యయనాన్ని చేపట్టాయి. ఈ పరిశోధనలో భాగంగా కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మరణించిన పలు కేసులను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా విశ్లేషించారు. వారి ఆరోగ్య నేపథ్యం, వ్యాక్సినేషన్ వివరాలు, ఇతర వైద్య సంబంధిత అంశాలను పరిశీలించారు. ఈ అధ్యయనంలో ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణం బాధితులకు ముందు నుంచే ఉన్న అనారోగ్య సమస్యలే అని తేలింది. దాదాపు నెలరోజులపాటూ జరిపిన ఈ అధ్యయనంలో జన్యుపరమైన లోపాలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలే కారణమని నిర్ధరణ అయ్యింది. వ్యాక్సిన్ల వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదని నివేదిక పేర్కొంది.
Also Read..
Ola-Uber | రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకోవచ్చు.. క్యాబ్ సర్వీస్ సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్
PM Modi | విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని.. 8 రోజులపాటూ ఐదు దేశాల్లో పర్యటించనున్న మోదీ
India-US | త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందం.. చాలా తక్కువ సుంకాలతోనే డీల్ ఉంటుందన్న ట్రంప్