India-US | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై (India-US trade deal) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక ప్రకటన చేశారు. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా తక్కువ సుంకాలతోనే ఈ డీల్ (deal with much less tariffs) ఉంటుందని తెలిపారు.
ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా సంస్థలకు పన్నులను తగ్గించడానికి న్యూ ఢిల్లీ సిద్ధంగా ఉందన్నారు. ‘భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. అది ఓ కొత్త డీల్ అవుతుంది. అయితే, ప్రస్తుతం భారత్ ఆ డీల్‌ను ఇంకా అంగీకరించలేదు. ఒక వేళ వాళ్లు అంగీకరిస్తే.. చాలా తక్కువ సుంకాలతో డీల్ కుదురుతుంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై అదనపు సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అదనపు సుంకాలకు గడువు జులై 8 వరకూ నిర్ణయించారు. అంతలోపు ఆయా దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే, జులై 9 నుంచి అదనపు సుంకాలు వడ్డిస్తారు. అంతలోపే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నారు.
కాగా, భారత ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 10 శాతం టారిఫ్ విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై అదనపు సుంకాలను ప్రకటించారు. ఏప్రిల్ 2న మన దేశంపై ట్రంప్ 26 శాతం అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అదనపు సుంకాలను జులై 9 వరకూ నిలిపివేస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం గతంలోనే ప్రకటించింది. ఈ అదనపు 26 శాతం సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని భారత్ కోరుతోంది.
Also Read..
500 Percent tariff | రష్యాతో వ్యాపారం.. భారత్‌పై అమెరికా 500 శాతం సుంకాలు..!
Amarnath Yatra | కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర