Shahed drones : పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-అమెరికా (Israel-USA) దేశాలకు ఇరాన్ (Iran) కు మధ్య జరుగుతున్న యుద్ధంలో డ్రోన్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అమెరికా (USA) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పశ్చిమాసియాలోని పలు దేశాలపై ఇరాన్ పెద్దఎత్తున షాహెద్ డ్రోన్ల (Shahed drones) ను ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ఇరాన్ సైనికవర్గాలు తీవ్ర ఆరోపణలు చేశాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమ షాహెద్ డ్రోన్లను పోలిన డ్రోన్లను రూపొందించి పశ్చిమాసియాలోని పలు దేశాలపై దాడులకు పాల్పడుతున్నాయని, ఆ నిందను తమపై మోపుతున్నాయని ఆరోపించాయి. తమ దేశాన్ని కుట్రపూరితంగా ఇరికించేందుకు డ్రోన్లను జనావాసాలపై ప్రయోగిస్తున్నాయని మండిపడ్డాయి.
సైనిక సవాళ్లను ఎదుర్కోవడంలో, టెహ్రాన్‌కు వ్యతిరేకంగా రాజకీయ శక్తులను కూడగట్టడంలో శత్రుదేశాలు (అమెరికా, ఇజ్రాయెల్) విఫలమయ్యాయని వ్యాఖ్యానించింది.
నేరుగా ఏమీ చేయలేక మోసపూరిత వ్యూహాల వైపు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మొగ్గు చూపుతున్నాయని ఇరాన్ సైనిక వర్గాలు విమర్శించాయి. తుర్కియే, కువైట్, ఇరాక్ లాంటి దేశాల్లో ఇటీవల అనేక అనుమానాస్పద దాడులు జరిగాయని, ఈ దాడులు ఇరాన్ బలగాల పనేనని పాశ్చాత్య మీడియా నిందమోపుతోందని ఆరోపించాయి. ఇరాన్‌పై అనుమానాలు రేకెత్తించి పొరుగుదేశాలతో సంబంధాలను దెబ్బతీయడమే లక్ష్యంగా శత్రు దేశాలు పనిచేస్తున్నాయని వెల్లడించాయి.
ఇటీవల సైప్రస్‌లోని బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ అక్రోటిరి స్థావరంపై ఓ డ్రోన్ దాడి జరిగిందని, అయితే దాని వెనుక ఇరాన్ ప్రమేయం లేదని ఆయన స్పష్టంచేశారు. తమ సైనిక కార్యకలాపాలు అత్యంత క్రమశిక్షణతో కొనసాగుతున్నాయని అన్నారు. తాము ఎంచుకున్న లక్ష్యాలపైనే దాడులు చేస్తున్నామని, వాటికి బాధ్యత తీసుకుంటున్నామని తెలిపారు. శత్రుదేశాల కుట్రలను ప్రాంతీయ భాగస్వామ్యపక్షాలు తిప్పికొడతాయని విశ్వాసం వ్యక్తంచేశారు. ఐక్యత, సహకారాన్ని కొనసాగించడం ద్వారా దురాక్రమణదారులను నిలువరించడం ముఖ్యమని పేర్కొన్నారు.