హైదరాబాద్, సెప్టెంబర్13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసుల తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీస్ శాఖ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని సోషల్‌మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బడాబాబులకో రీతిగా, సామాన్యులకు మరోరీతిగా వ్యవహరిస్తున్నదని విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు విషయమేమంటే? పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ర్యాపిడో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనగా భీమవరానికి చెందిన 26 ఏండ్ల యువతి హేమదుర్గ అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ఘటనలో 24 గంటలు గడువకముందే పోలీసులు ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేశారు. ప్రమాదానికి కారణమంటూ ఆర్టీసీ డ్రైవర్ షేక్ అన్వర్‌ను సైతం అరెస్టు చేశారు. ఇటీవల మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు సంజుశ్ తన కారుతో ఢీకొట్టగా ఓ యువతి ప్రాణాలను కోల్పోయింది.
ఈ ప్రమాదం జరిగి నెలరోజులు కావస్తున్నది. నిందితుడిని కేవలం స్టేషన్‌కు పిలిపించుకొని వదిలేశారు. ఇదే విషయాన్ని పోలీస్ శాఖకు తాజాగా నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఎంపీ కొడుకుకు ఒక న్యాయం.. ఆర్టీసీ డ్రైవర్‌కు మరో న్యాయమా? అంటూ సోషల్‌మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు.