బెంగళూరు: నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వుతో జీవిత ఖైదీని జైలు నుంచి విడుదల చేసినట్లు ప్రస్తుతం జైళ్ల శాఖ డీఐజీగా ఉన్న పోలీస్ అధికారిపై ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం పోలీస్ట్ కస్టడీకి తరలించారు. (Karnataka prisons DIG arrested) కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. కిడ్నాప్ కేసులో దోషిగా తేలిన శంకర్‌కు ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2004లో జీవిత ఖైదు, రూ. 10,000 జరిమానా విధించింది. కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టులో అతడు దాఖలు చేసిన అప్పీళ్లలో కూడా ఆ శిక్ష రద్దు కాలేదు.
కాగా, ఆ సమయంలో బెంగళూరు కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విభాగంలో సెకండ్ డివిజన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్, సుప్రీంకోర్టు ఉత్తర్వుగా పేర్కొన పత్రాన్ని ఫోర్జరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నాడు బెంగళూరు సెంట్రల్ జైలు చీఫ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన సోమశేఖర్ దీనికి సహకరించినట్లు ఆరోపించారు. 2018 నవంబర్ 2న ఉత్తర్వు జారీ చేసినట్లుగా ఉన్న నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వు ఆధారంగా నవంబర్ 13న శంకర్‌ను జైలు నుంచి విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేశారు. జైలు నుంచి విడుదలైన శంకర్ భార్యను కూడా ప్రశ్నించారు. దీంతో విడుదల కోసం జారీ చేసిన సుప్రీంకోర్టు ఉత్తర్వు నకిలీ అని తేలింది. ఈ నేపథ్యంలో బెంగళూరు సెంట్రల్ జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఈ ఏడాది మే 20న పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదైంది.
అయితే ప్రస్తుతం కర్ణాటక జైళ్లు, సంస్కరణ సేవల విభాగం డీఐజీగా ఉన్న ఎం సోమశేఖర్ ఈ కేసు విచారణకు సహకరించలేదని, ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఆయన దాచినట్లు తదుపరి విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తరలించారు.